
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న బంజారా లేక్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్ బుధవారం ( ఏప్రిల్ 8 ) ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి బంజారా లేక్ ను పరిశీలించారు. చెరువులోకి మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రంగనాథ్. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా బంజారా లేక్ ఇప్పుడు అత్యంత కలుషిత జలవనరుగా మారిందని అన్నారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో రహదారి నిర్మాణం, చెరువు ఉనికికే ముప్పు తెచ్చిందని అన్నారు. కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లే మార్గం ఆక్రమణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. ప్రభుత్వ భూమిని కాపాడుతూ చెరువు పునరుద్ధరణకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామన్నారు కమిషనర్ రంగనాథ్. నివాసాలను ప్రభావితం చేయకుండా చెరువు రక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
►ALSO READ | హైదరాబాద్ జలవిహార్ లో ఆర్వో ప్లాంట్ పేలుడు… ఇద్దరికి తీవ్ర గాయాలు..
నాలాలు మూసివేసే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రంగనాథ్. అనంతరం శంషాబాద్ లోని మామిడిపల్లిలో నాలుగైదు చెరువులు మాయమయ్యాయన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు రంగనాథ్. ఒంగోని కుంట, కనకయ్య కుంట, మర్రివాణి కుంట, ఎర్రకుంట ఆక్రమణలపై సీరియస్ అయ్యారు రంగనాథ్. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
వరద కాలువలు ఆక్రమణలతో మూసివేతకు గురై వర్షాకాలంలో నీటిమునిగే ప్రమాదం ఉందని..ఆక్రమణదారులతో సమావేశమయ్యి స్వచ్ఛందంగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, కాలువలపై పూర్తి స్థాయి డేటా సేకరణకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్.