Reading Time: 2 minutes

Rajinikanth: మీకు ఏదైనా జరిగితే మీ హీరోలు రారు.. జాగ్రత్త! ఫ్యాన్స్‌కు రజనీకాంత్ హితబోధ!

Caption of Image.

 సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే కేవలం వెండితెరపై ఆరాధ్య దైవం మాత్రమే కాదు, కోట్లాది మందికి ఒక మార్గదర్శిగా భావిస్తారు. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, ప్రస్తుత యువత ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన సహచర నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ప్రచార కార్యక్రమాల్లో అభిమానులు ప్రాణాలకు తెగించి ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన స్పందించారు. అభిమానుల క్షేమం కోరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతున్నాయి.

అభిమానం హద్దులు దాటకూడదు..

సినిమా తారలపై అభిమానం ఉండటం సహజం. కానీ అది ప్రాణాల మీదకు రాకూడదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇటీవల నటుడు విజయ్ రాజకీయ ప్రచారాల్లో అభిమానులు వాహనాల మీదకు దూకడం, తొక్కిసలాటలకు గురికావడం వంటి ఘటనలు చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాద ఛాయలు ఇంకా మరువకముందే, అభిమానులు మళ్లీ అదే తప్పులు చేయడంపై రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఏదైనా జరిగితే బాధపడేది మీ కుటుంబమే తప్ప మీ హీరోలు కాదు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది అని రజనీకాంత్  హితబోధ చేశారు.

చదువే అసలైన ఆయుధం

రాజకీయాలు, సినిమాలు పక్కన పెడితే.. విద్యార్థి దశ అత్యంత విలువైనదని రజనీకాంత్ గుర్తుచేశారు. ఈ సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన కోరారు. యవ్వనంలో చదువుపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.  తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించడమే మీరు మీ హీరోలకు ఇచ్చే అసలైన గౌరవం  సూచించారు.

వ్యసనాలకు దూరంగా ఉండండి

ప్రస్తుత సమాజంలో యువతను పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి మాదకద్రవ్యాలు. దీనిపై రజనీకాంత్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలైతే మీ జీవితంతో పాటు మీ కుటుంబం కూడా నరకాన్ని అనుభవిస్తుంది. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే స్నేహితులను వెంటనే వదిలేయండి అని ఆయన హితవు పలికారు. రజనీ కాంత్ యువత నుద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ : ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’ మూవీ ఆగిపోయిందా?

వెయిటింగ్ ఫర్ ‘తలైవర్’ మ్యాజిక్

ఈ సందర్భంగా తన వృత్తిపరమైన విషయాలను కూడా రజనీ పంచుకున్నారు. తన తాజా చిత్రం ‘కూలీ2’ సంబంధించి సుమారు 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిగ్గజ నటుడు కమల్ హాసన్‌తో కలిసి నటించే విషయంపై స్పందిస్తూ.. కథ, స్క్రిప్ట్ చర్చలు దర్శకులు, నిర్మాణ సంస్థల వద్ద ఉన్నాయని, సరైన సమయంలో ప్రకటన వస్తుందని హింట్ ఇచ్చారు. . రంగుల ప్రపంచం వెనుక ఉన్న వాస్తవాలను గ్రహించి, బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే నిజమైన ‘స్టైల్’ అని అభిమానులకు సూచించారు.  ఆరోగ్యం, విద్య, కుటుంబం – ఈ మూడింటినీ కాపాడుకున్నప్పుడే ఏ అభిమానానికైనా అర్థం ఉంటుందని చెప్పారు.

 

©️ VIL Media Pvt Ltd.