Reading Time: < 1 minute

బంగారు నగల కోసం వృద్ధురాలిని చంపి ..పెట్రోల్ పోసి నిప్పంటించారు

Caption of Image.

బంగారు నగల కోసం కన్నతల్లి లాంటి వృద్ధురాలిని పొరుగువారే పొట్టనబెట్టుకున్నారు. ఈ  అమానుష ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.  అసలేం జరిగిందంటే. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లకు చెందిన 60 ఏళ్ల వెంకటమ్మను  నమ్మించి గొంతు నులిమి చంపడమే కాకుండా సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు శవాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు నిందితులు.

వెంకటమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలే లక్ష్యంగా పక్కింటికి చెందిన మంజుల, ఆమె భర్త బీరప్ప, అరుణ్ అనే మరో వ్యక్తి కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్లాన్  ప్రకారం వెంకటమ్మను హత్య చేసిన నిందితులు ఆమె నగలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తిర్మలాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు.

వెంకటమ్మ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన ఆమె కుమార్తె లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితుల ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.ప్రస్తుతం ఘటనా స్థలంలో సగం కాలిన మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.