
- 24 గంటల్లో ఎంట్రీ చేయట్లే
- రెండు నెలలకు పైగా పెండింగ్లోనే
- చెప్పులరిగేలా తిరుగుతున్న బాధితులు
- ఇప్పటికే ఉస్మానియాకి నోటీసులు
- ఇదే బాటలో గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే, ఇతర హాస్పిటల్స్
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన సంజీవరెడ్డి ఉస్మానియా దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిబ్రవరి 26న చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత డెత్ సర్టిఫికెట్ కోసం రోజూ మీసేవలో చెక్ చేస్తున్నా కనిపించడం లేదు. జీహెచ్ఎంసీకి వెళ్లి అడిగితే ఉస్మానియా దవాఖాన నుంచే ఇంకా నమోదు కాలేదని చెప్పారు. హాస్పిటల్ కి వెళ్లి అడిగితే ఏమీ చెప్పడం లేదు. 41 రోజులైనా డెత్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆ కుటుంబానికి అందాల్సిన బెనిఫిట్స్రాక ఇబ్బందులు పడుతోంది.
హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్కార్ దవాఖానల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆలస్యమవుతున్నాయి. రెండు నెలలు దాటుతున్నా సర్టిఫికెట్లు రావడంలేదు. రూల్స్ప్రకారం.. దవాఖానలో పుట్టిన లేదా మరణించిన 24 గంటల్లోపు ఆ వివరాలను దవాఖాన స్టాఫ్ఆన్లైన్ చేసి జీహెచ్‌ఎంసీకి పంపాలి. కానీ, ఈ పద్ధతిని ఎక్కడా పాటించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది సమన్వయ లోపంతో వందల అప్లికేషన్లు అప్రూవల్ కాక పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది దవాఖానల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
అన్ని సర్కారు దవాఖానల్లో…
నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబురుజు, కోఠి మెటర్నటీ, ఎంఎన్ జే క్యాన్సర్హాస్పిటల్వంటి ప్రధాన దవాఖానల్లో అధికారులు, సిబ్బంది తీరు వల్ల సమయానికి సర్టిఫికెట్లు అందడం లేదు. ఈ దవాఖానలన్నింటిలో కలిపి రోజూ వందల సంఖ్యలో డెలివరీలు, మరణాలు సంభవిస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన సిబ్బంది లైట్తీస్కుంటున్నారు.
ఈ పనులను నెలలుగా పెండింగ్‌లో పెడుతుండడంతో ఫైళ్లు ముందుకు కదలక బాధితులు కష్టాలు పడుతున్నారు. సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉస్మానియా దవాఖానకి జీహెచ్ఎంసీ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చిన చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వ దవాఖానల్లో సర్టిఫికెట్ల ఆలస్యంతో పాటు స్పెల్లింగ్ మిస్టేక్స్ పై జీహెచ్ఎంసీ ఇదివరకే ఒకసారి ట్రైనింగ్ క్లాస్ నిర్వహించినా మార్పు రావడంలేదు.
వచ్చిన సర్టిఫికెట్లలోనూ తప్పులే..
ఆలస్యంగానైనా ఇస్తున్న సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఉండడం లేదు. పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్, పుట్టిన తేదీల్లో తేడాలు, తండ్రి పేర్ల మార్పు వంటి పొరపాట్లు సర్వసాధారణమైపోయాయి. దీంతో నెలల తర్వాత అయినా సర్టిఫికెట్లు చేతికి వచ్చాయని సంబురపడే అవకాశం లేకుండా పోతున్నది. ముఖ్యంగా డెత్ సర్టిఫికెట్ల విషయంలో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు.
వీటిని సరి చేయించుకోవడానికి మళ్లీ దవాఖానలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ట్రీట్ మెంట్ కి హాస్పిటల్స్ వచ్చి అడ్మిట్అయిన టైంలో కే షీట్ పైన పేర్ల వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం వల్లే ఇలా జరుగుతోందని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు.
సిస్టమ్ పని చేయట్లేదు.. అప్రూవల్ కాలేదు
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలతో పాటు ఏపీ, కర్నాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్జే వంటి దవాఖాలనకు పేషెంట్లు వస్తుంటారు. ఇందులో ఎవరైనా చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, పెన్షన్లు, ఆస్తి సంబంధిత పనుల కోసం డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
సర్టిఫికెట్ వచ్చిందేమో కనుక్కుందామని వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తే.. ‘సిస్టమ్ పని చేయడం లేదు.. అప్రూవల్ కాలేదు.. వచ్చే వారం రండి” అని సమాధానం చెప్తున్నారు. కనీసం వచ్చిన వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు. సూపరింటెండెంట్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.