
E20 పెట్రోల్ పై ఇన్నాళ్లుగా నెలకొన్న ఆందోళన ఉద్యమరూపం దాల్చనున్నట్లు కనిపిస్తోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ను ఇప్పటికే వాహనదారులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇథనాల్ కారణంగా ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ రావటం లేదని విజ్ఞప్తులు, అభ్యంతరాలు చెబుతూ వస్తున్నారు. లేటెస్టుగా ఆదివారం (జులై 05) ఢిల్లీలో వాహనదారులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
హమారా గాడీ, హమారా అధికార్.. అనే ట్యాగ్ లైన్ తో ప్రముఖ ఆంత్రాప్రెన్యూవర్, టీవీ నటుడు తెహసీన్ పూనావాలా ఆధ్యర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం బలవంతంగా ఈ20 పెట్రోల్ పేరున 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
అంతకు ముందు.. ఇటీవలే.. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందని, వాహనాలు అరిగిపోతాయని వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్, ఆయిల్ కంపెనీలకు చెందిన నిపుణులతో కూడిన బృందం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని సమర్థించింది. E20 వల్ల వాహనాలకు హాని కలుగుతుందనడానికి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదని పరీక్షల్లో తేలినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 పెట్రోల్ వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగదని చెబుతున్నారని.. అందులో నిజం లేదని నిరసనకారులు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్నో, బీజేపీ నో టార్గెట్ చేస్తున్న నిరసన కాదని.. నిరసనకారులలో చాలామంది బీజేపీ మద్దతుదారులమని చెప్పారు. ఇథనాల్-బ్లెండింగ్ విధానాన్ని అమలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
►ALSO READ | మరో భర్త కథ ముగిసింది.. భర్తను చంపేసి పోస్ట్మార్టంలో దొరకకుండా ఏమన్నా స్కెచ్ వేసిందా..?
గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఈ20 పై ఫిర్యాదుల వెల్లువ వెల్లువెత్తింది — కార్లు ఆగిపోవడం, మైలేజీ సడెన్ గా పడిపోవడం, ఫ్యూయల్ ఫిల్టర్లు మూసుకుపోవడం, రిపేర్ లకు ఖర్చు ఎక్కువ కావడం వంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వేగంగా ప్రారంభించి, గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని సాధించింది ప్రభుత్వం. అయితే వెహికిల్ ఓనర్లపై భారీప్రయోగమని విమర్శకులు వాదిస్తున్నారు . గత 15 ఏళ్లలో ఇండియాలో అమ్ముడైన కార్లలో సుమారు 80% E20కి పూర్తిగా అనుకూలంగా లేనివే ఉన్నాయి. ఎందుకంటే వాటిలో చాలా వరకు E10 లేదా అంతకంటే బ్లెండింగ్ ఇంధనాల కోసం తయారు చేసినవే.
నిరసనకారులు చెప్పిన E20 సమస్యలు:
గుర్గావ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సార్థక్, తాను 2018 బాలెనో (E10 ప్రమాణాలకు అనుగుణంగా) నడుపుతున్నానని, మైలేజీలో భారీ తగ్గుదల చూసినట్లు చెప్పాడు. గత రెండు నెలలుగా, నా మైలేజ్ లీటరుకు 18 కిలోమీటర్ల నుండి 14 కిలోమీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని తెలిపాడు. అంటే మైలేజీలో సుమారు 22% తగ్గినట్లు చెప్పాడు.
మరో నిరసనకారుడు మాట్లాడుతూ నేను బ్లెండింగ్ పెట్రోల్ కొనను. ఎందుకంటే నా కారు పాడైపోతుంది అని అన్నాడు.
ఢిల్లీలోని పటేల్ నగర్‌కు చెందిన రాజ్ సింగ్ మరింత ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించారు. గత ఏడు నెలలుగా E20 ఇంధనాన్ని వాడటం వల్ల తన కారు ఇంజిన్ లో డ్యామేజ్ అయిందని తెలిపాడు.
డబ్బు ఆదా అవుతుందని భావించి గత ఏడు నెలలుగా నేను E20 నింపుతున్నాను, కానీ గత నెలలో నా కారు అకస్మాత్తుగా పికప్ పోయింది. ఇంజన్ వార్నింగ్ లైట్ వెలిగింది. నేను మొత్తం ఫ్యూయల్ సిస్టమ్‌ను శుభ్రం చేయించి, భాగాలను మార్పించాల్సి వచ్చింది. దీనికి నాకు రూ. 35,000 పైగా ఖర్చయింది, అని ఆవేదన వ్యక్తం చేశాడు.