Reading Time: < 1 minute

ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూ టీమ్ 38.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అలీసా హీలీ, లిచ్‌ఫీల్డ్‌లు ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 4 ఫోర్లతో 50 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్ ఆరు బౌండరీలతో 32 పరుగులు సాధించింది.

వికెట్ కీపర్ బెథ్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మూడీ 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు సాధించింది. అనబెల్ సదర్లాండ్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 48 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53), రిచా ఘోష్ (23), కాశ్వి గౌతమ్ (43) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్‌నర్ మూడు, మెగాన్ షుట్ రెండు వికెట్లు తీశారు.