July 6, 2026

విజ్ఞాన విషయాల మాలిక – వార్షిక.. జ్ఞానం నిత్యం నేర్చుకోదగిన, తెలుసుకోదగిన ప్రక్రియ

విజ్ఞాన విషయాల మాలిక - వార్షిక.. జ్ఞానం నిత్యం నేర్చుకోదగిన, తెలుసుకోదగిన ప్రక్రియ
Reading Time: 3 minutes

విజ్ఞాన విషయాల మాలిక – వార్షిక.. జ్ఞానం నిత్యం నేర్చుకోదగిన, తెలుసుకోదగిన ప్రక్రియ

Caption of Image.
  •  వివేకం నిరంతరం అన్వేషిస్తూ ఆచరించదగిన సత్ క్రియ!!

సకల చరాచర సృష్టిలో మానవుడు మిగతా జీవులన్నింటిపైనా ఆధిపత్యం వహిస్తూ ప్రపంచాన్ని శాసించే స్థితికి రావడం వెనక ఉన్న ఒకే ఒక్క కారణం -జ్ఞానం. మనిషిలో సహజంగా క్రమానుగతంగా రూపొందిన జ్ఞానం, విజ్ఞానాల అన్వేషణలే ఈ అనూహ్య పురోగతిలో కీలక భూమిక పోషించాయని చెప్పొచ్చు. అదే సమయంలో కాలం, సమయం, భూ భ్రమణ,- పరిభ్రమణల ఫలితంగా రూపొందే రుతువులు, ప్రపంచ గమనాలు అన్నీ ఎప్పటికప్పుడు మనిషి జ్ఞానాన్ని దశలవారీగా గుర్తించడానికి, దాన్ని మరింత విస్తరింపచేయడానికి, మనిషి సాధించిన విజ్ఞానపు సంచయాన్ని సుసంపన్నం చేయడానికి దోహదపడతాయి. అందుకే జ్ఞాన, విజ్ఞాన పరంపరని కాలం, సమయం ఆధారంగా నిర్ధారించే పరిస్థితి అమలులోకి వచ్చింది.

కాలాన్ని గణించడం కనుక్కున్న తర్వాత సంవత్సరానికి 365 రోజులు,12 మాసాలు, మాసానికి 30 రోజులు, రోజుకు 24 గంటలుగా గమనించి తన పరిణామ ప్రాకృతిక వికాసాన్ని గుర్తించే స్థితికి మానవుడు ఎదిగాక, గడుస్తున్న ప్రతిరోజు ఎన్నో అభ్యసనాలు, యత్న- దోషాలు, అనుభవాలు, జ్ఞాన, విజ్ఞానాల సంకలనంగా రూపొందుతూ వచ్చింది. ఆ క్రమంలోనే భారతీయ పంచాంగ నిపుణులు, ఖగోళ శాస్త్రవేత్తలు 60 ఏళ్ల చక్రీయ గమనంతో కూడిన కాలమానాన్ని గమనించి, ప్రతి సంవత్సరానికి ఒక నిర్దిష్ట లక్షణాలను ఆపాదించి, ఆ క్రమంలోనే వాటికి ప్రభవ, విభవ, ప్రమోదూత వంటి పేర్లు పెట్టారు.

ఇవన్నీ ఒకవైపు అయితే ప్రపంచ, స్థానిక, జాతీయ రంగాలలో జరిగే పరిణామాలు సంవత్సర కాలపు ప్రాతిపదికన అందరికీ ఒక గుణ పాఠాలుగా చెప్పొచ్చు. ఆ లెక్కన ఒక సంవత్సర కాలం వివిధ సంఘటనలు, సన్నివేశాల సమాహారం అని భావించొచ్చు. 

అనంత కాల ప్రవాహంలోని గమనాన్ని ఒక సంవత్సరం ప్రాతిపదికగా ఒడిసి పట్టడం, రికార్డు చేయడం, వివరించడం, విశ్లేషించడం అంటే ‘‘కాలంలోని ఒక ముక్క’’ను స్థిరీకరించడమే! “కాలం అనే ప్రయోగశాలలో వివిధ మానవులు చేస్తున్న పనులు, కార్యాలు, ఫలితాలను నమోదు చేయడమే !’’ అంటే ఒక సంవత్సరం అనేది ఒక కాల పరిమితిలో మానవ జాతి యావత్తు నిర్వహించిన మొత్తం కార్యకలాపాల ప్రయోగ శాల అన్నమాట!

అలా కాల చక్రంలో ఏదో ఒక సంవత్సరాన్ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని, దానికి ముందు ఉండే పరిస్థితులు, మనం ప్రమాణంగా తీసుకున్న సంవత్సరానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, సాంకేతిక, వైజ్ఞానిక, పాలనాపరమైన ఎన్నో అంశాల పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రామాణిక సంవత్సరంలోని సంఘటనలు రాబోయే సంవత్సరపు పరిణామాలకు కారణం కావడం లేదా మార్గదర్శనం చేస్తాయి. 

ఇదొక నిరంతర సమయ స్రవంతి.ఈ విషయాలన్నింటినీ సాకల్యంగా గమనించారు గనకే అన్ని పోటీ పరీక్షలలో అభ్యర్థుల జ్ఞాన, విజ్ఞాన, వివేక, వివేచన అంశాలను పరీక్షించడానికి ‘‘కరెంట్ అఫైర్స్” పేరిట సమకాలీన వార్త, విశేషాలు, విశ్లేషణలను అభ్యర్థి జ్ఞానాన్ని పరీక్షించే కొలమానాలుగా గుర్తించారు. అందుకే ప్రతీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కనీసం15 నుంచి 25 శాతం ప్రశ్నలు ఈ సమకాలీన అంశాల నేపథ్యంలో నుంచే అడుగుతుంటారు.

ఒక సంవత్సర కాలంలో జరిగిన అన్ని అంశాలను ఒకే చోట సంకలనం చేసి సంఘటనల సమాహారంగా విషయ విశ్లేషణ ప్రాతిపదికగా సమకూర్చే సంప్రదాయానికి మేధావులు, వార్తా పత్రికలు, జర్నలిస్టులు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో టైం, న్యూస్ వీక్, మనదేశంలో ఫ్రంట్​ లైన్​, ది వీక్​, ఇండియా టుడే, లాంటి పత్రికలు, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన మ్యాగజైన్లు ప్రతి డిసెంబర్, జనవరి నెలల్లో ప్రత్యేక సంచికలుగానో, పబ్లికేషన్స్​ డివిజన్​ వంటి ప్రభుత్వ అధికారిక సంస్థలు, ఏటా ఇయర్ బుక్స్​ పేరిట సమగ్రంగానో పుస్తకాలను ప్రచురిస్తూ వస్తున్నాయి. 

అందుకే తెలంగాణా బి.సి ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి & శిక్షణా కేంద్రం (బి.సి స్టడీ సర్కిల్) తొలిసారిగా “వార్షిక – 2025” పేరుతో ఇయర్ బుక్​ని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నది. ఇది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కరదీపికగా ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అందుకే ఈ పుస్తకాన్ని ప్రధానంగా రెండు రకాల జ్ఞానపరమైన అంశాలను క్రోడీకరించి రూపొందించాం. 

మొదటిది సమకాలీనంగా ఒక సంవత్సర కాలంలో ఎప్పటికప్పుడు సంభవించిన సంఘటనలూ, సన్నివేశాలూ, ఆవిష్కరణలు ఆధారంగా పూర్వ జ్ఞానానికి కొనసాగింపుగా ఉంటుంది. రెండోది నిర్దిష్ట జ్ఞానం. ఇది కాలాతీతంగా, మార్పులేవీ లేని ఒక ప్రాథమిక ప్రాతిపదిక జ్ఞానంగా ఉంటుంది. అయితే ఈ రెండు కలిస్తేనే సంపూర్ణ జ్ఞానం అనొచ్చు. 

మనిషిలో జ్ఞానం 360 డిగ్రీల స్థాయిలో విస్తరణ జరగాలంటే, ప్రాధమిక ప్రాతిపదికగా ఉండే180 డిగ్రీల జ్ఞానం ఒకవైపు అయితే, ఏ ఏటికాయేడు సంభవించే సమకాలీన జ్ఞానం మరో180 డిగ్రీలుగా ఉంటుంది. నిజానికి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలన్నీ ఈ రెండు అంశాల మేళవింపుగానే ఉంటాయి.

ఈ రెండింటినీ గమనించి ఈ “వార్షిక -2025లో 2025 సంవత్సరం మొత్తంమీద నెలల వారీగా జరిగిన వివిధ సందర్భాలను, సంఘటనలను విశ్లేషించడం, వివరించడం మాత్రమే కాకుండా, ఆయా శాస్త్రాలకు సంబంధించి సాధారణ ప్రాపంచిక పరిజ్ఞానం వంటి అంశాలు పుస్తకంలో ఉంటాయి. అలాగే ఒక సంవత్సర కాలానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్​ ఉంటాయి. 

అలా ఈ పుస్తకం 2025వ సంవత్సరపు పాక్షిక డాక్యుమెంటేషన్​గా నేను భావిస్తాను. అందుకే ఈ పుస్తకం కేవలం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మాత్రమే కాకుండా వివిధ అంశాలపై ఆసక్తి ఉన్న పరిశోధకులకు, సామాజిక కార్యకర్తలకు, మేధో బుద్ధి జీవులకు, జర్నలిస్టులకు ఒక కరదీపికగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను. 

అలాగే ఎండోమెంట్ డిపార్ట్​మెంట్​కు సంబంధించిన ఉద్యోగాల రిక్రూట్మెంట్ నేపథ్యంలో “భారతీయ హైందవ విజ్ఞానం’’ పేరిట ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడం ఈ పుస్తకంలో అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. ఇలాంటి కంటెంట్​ను కూడా ప్రధాన స్రవంతి ఇయర్ బుక్​లో భాగంగా రూపొందించిన తొలి ప్రతి ఇది.

– డా. మామిడి హరికృష్ణ, డైరెక్టర్, బి.సి. స్టడీ సర్కిల్,సంక్షేమ భవన్, హైదరాబాద్

లైఫ్​ & లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com
 

©️ VIL Media Pvt Ltd.