Tilak Varma : క్రికెట్ ప్రపంచంలో తెలుగోడి సంచలనం.. కోహ్లీ, రోహిత్‌లను దాటేసి వరల్డ్ రికార్డ్

Tilak Varma : భారత క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు మైదానంలో పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను తమ పేరిట లిఖించుకుంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ తెలుగు కుర్రాడు చెలరేగి ఆడి సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ చరిత్రలో అత్యంత తక్కువ వయస్సులోనే 1500 పరుగుల మార్కును దాటిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టడం విశేషం.
క్రికెట్ మైదానంలో రికార్డులు సృష్టించడం, అవి బద్దలవడం సహజమే అయినా.. దేశానికి చెందిన ఇద్దరు యువ తారల మధ్య జరిగిన ఈ పరుగుల పోటీ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఇంగ్లాండ్ పర్యటనలో జులై 1వ తేదీన జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ తన తుఫాన్ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో భారతదేశం తరఫున అత్యంత పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన రికార్డు అభిషేక్ పేరిట నమోదైంది. అయితే, ఆ రికార్డు సంతోషం కనీసం రెండు రోజులు కూడా నిలవలేదు. జులై 3న జరిగిన రెండో మ్యాచ్‌లోనే తిలక్ వర్మ పరుగుల వేట సాగించి అభిషేక్ శర్మ రికార్డును స్క్రాప్ చేసేశాడు.
భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు పూర్తి చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే యువ ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిస్టులో తిలక్ వర్మ కేవలం 23 సంవత్సరాల 238 రోజుల వయస్సులోనే ఈ అరుదైన మైలురాయిని అందుకుని మొదటి స్థానంలో నిలిచాడు. కాగా, ఓపెనర్ అభిషేక్ శర్మ 25 సంవత్సరాల 300 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. రికార్డుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ 27 సంవత్సరాల 143 రోజుల వయస్సులో ఈ మార్కును దాటి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ (28 సంవత్సరాల 230 రోజులు), ప్రస్తుత లెజెండ్ రోహిత్ శర్మ (30 సంవత్సరాల 234 రోజులు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ రికార్డుల గణాంకాలను బట్టి చూస్తే తిలక్ వర్మ భవిష్యత్తులో భారత జట్టుకు ఎంతటి కీలక ఆటగాడిగా మారబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..