July 6, 2026

Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు

Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
Reading Time: 2 minutes
Pregnancy Or Abortion Decision Is Woman Right Rules High Court

మహిళల పునరుత్పత్తి హక్కులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాలా అనే నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేసింది. ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టం (Medical Termination of Pregnancy Act – MTP Act) కింద దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన ఇండోర్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

కేసు ఏమిటి?

పిటిషనర్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వైవాహిక విభేదాల కారణంగా భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిగా నివసిస్తున్నారు. ఈ సమయంలో మహిళ గర్భవతి కావడంతో, గర్భాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. తన వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో తాను మానసికంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని, అలాంటి పరిస్థితుల్లో బిడ్డను కనడం, పెంచడం సాధ్యం కాదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

భర్త కోర్టుకు హాజరు కాలేదు

ఈ కేసులో హైకోర్టు పిటిషనర్ భర్తకు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన కోర్టుకు హాజరు కాలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్‌ను వ్యతిరేకించలేదు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ధర్మాసనం మహిళ అభ్యర్థనను పరిశీలించి గర్భస్రావానికి అనుమతి మంజూరు చేసింది.

ఆర్టికల్ 21ను ప్రస్తావించిన హైకోర్టు

తన తీర్పులో హైకోర్టు, ‘X vs Principal Secretary, Health and Family Welfare Department’ కేసులో Supreme Court of India ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఆ తీర్పు ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి మహిళకు తన శరీరం, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే హక్కును కల్పిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది. అవాంఛిత గర్భం మహిళపై మానసిక, శారీరక, భావోద్వేగ ప్రభావం చూపుతుందని, అలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని కొనసాగించమని ఆమెను బలవంతం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.

భర్త అనుమతి అవసరం లేదు

హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న అంశం ఏమిటంటే… గర్భాన్ని కొనసాగించాలా వద్దా అనేది మహిళ వ్యక్తిగత నిర్ణయం. గర్భస్రావం కోసం భర్త అనుమతి తప్పనిసరి కాదు. వైవాహిక సంబంధం దెబ్బతిన్నా, విడిగా జీవిస్తున్నా లేదా విడాకుల ప్రక్రియలో ఉన్నా మహిళ నిర్ణయాన్ని గౌరవించాలి.

ఆసుపత్రికి హైకోర్టు ఆదేశాలు

గర్భస్రావం ప్రక్రియను MTP చట్టం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు, అలాగే న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా, మహిళ గోప్యతను కాపాడాలి. గౌరవప్రదంగా వైద్య సేవలు అందించాలి. పూర్తి భద్రతతో చికిత్స అందించాలి. అని సంబంధిత ఆసుపత్రికి సూచించింది.

మహిళల హక్కులకు బలం

ఈ తీర్పు మహిళల పునరుత్పత్తి హక్కులు, శారీరక స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం వంటి రాజ్యాంగ హక్కులను మరోసారి స్పష్టం చేసింది. గర్భధారణ కొనసాగింపు లేదా గర్భస్రావం వంటి కీలక నిర్ణయాల్లో మహిళ అభిప్రాయమే అత్యంత ముఖ్యమని హైకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టంచేసింది.