Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్‌లైన్?

Allu Arjun and Atlee Movie Update: కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ చిత్ర షూటింగ్‌లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాకా షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అట్లీకి బన్నీ స్పష్టమైన డెడ్‌లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తదుపరి సినిమాల కోసం ఐకాన్ స్టార్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ పూర్తి కావాలని ఆయన కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
‘రాకా’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న భారీ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్ పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు. ఈ కారణంగానే ప్రస్తుత సినిమా షూటింగ్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని చిత్ర బృందానికి బన్నీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.800 కోట్ల వ్యయం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. షూటింగ్ పూర్తయిన అనంతరం విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ‘రాకా’ వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.