July 6, 2026

ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Reading Time: < 1 minute

ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Caption of Image.

కల్లూరు/ సత్తుపల్లి/ నేలకొండపల్లి, వెలుగు: ప్రజల ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఖమ్మం జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కల్లూరు మండలం చిన్నకోరుకొండిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్​ దివాకరతో కలిసి 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర సమీపంలోని వాగుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు.

మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ఎన్ఎస్పీలో హైవేపై రింగ్ సెంటర్ జంక్షన్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, కల్లూరు అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సత్తుపల్లిలో రూ.2 కోట్ల నగరాభివృద్ధి నిధులతో అవుట్‌‌డోర్ ప్లే ఫీల్డ్, రన్నింగ్ ట్రాక్, టెన్నిస్, వాలీబాల్ కోర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

యాతాలకుంటలో నిర్మించిన హై లెవల్​ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చు చేసి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించగా చివరకు డ్యామ్​ మరమ్మతుల పరిస్థితికి ఎందుకు వచ్చిందని  ఆపార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మను దోచుకున్న వారికి ఇప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. నేలకొండపల్లి మండలం బోదులబండ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో డాక్టర్ మట్టా దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, పురపాలక చైర్‌‌పర్సన్ ఎండీ రెహానా బేగం, కమిషనర్ కొండ్ర నర్సింహ తదితరులున్నారు.

©️ VIL Media Pvt Ltd.