Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!

Anjana Singh: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అవకాశాల కోసం కొందరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి పలువురు నటీమణులు గతంలో బహిరంగంగానే మాట్లాడారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారుతున్నాయని, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ రూపమే పూర్తిగా మారిపోయిందని భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అంజనా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భోజ్‌పురి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అంజనా సింగ్, ఇటీవల ఆయుష్ నిర్వహించిన ‘స్మైల్ అండ్ టాక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సినీ పరిశ్రమలో అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ వంటి అనేక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని ఎప్పుడూ తన సొంత నియమాల ప్రకారమే నడిపించానని, అదే విధానాన్ని కెరీర్‌లో కూడా పాటించానని చెప్పారు. అందుకే తాను వ్యక్తిగతంగా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితిని ఎదుర్కోలేదని స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూలో భోజ్‌పురి స్టార్ ఖేసరి లాల్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రతి నటి క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతుంది. కానీ అది నాకు జరిగిందని మాత్రం ఎవరూ చెప్పరని ఖేసరి వ్యాఖ్యానించిన విషయంపై అంజనా స్పందించారు. మొదట ఆ వ్యాఖ్యపై నవ్విన ఆమె, ఖేసరి చెప్పాలనుకున్న భావం చాలా సందర్భాల్లో సరైనదేనని, అయితే ఆయన మాట్లాడే విధానం వల్ల కొన్నిసార్లు వేరేలా అర్థమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అంజనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే పదానికి రూపం మారిపోయిందని అన్నారు. ప్రస్తుతం ప్రేమ పేరుతో దగ్గరవడం, ఒక జంటగా కొనసాగుతున్నంత కాలం అవకాశాలు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి సంబంధాలను బయటకు ప్రేమగా చూపించినప్పటికీ, వాటి వెనుక అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో బయటివారికి పూర్తిగా తెలియవని ఆమె అభిప్రాయపడ్డారు.
అయితే అంజనా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం సినీ పరిశ్రమను కాదని, ఆమె తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక అంజనా సింగ్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, ఆమె కేవలం 21 ఏళ్ల వయసులో “ఏక్ ఔర్ ఫౌలాద్” చిత్రంతో భోజ్‌పురి సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె, కెరీర్ ప్రారంభమైన తొలి రెండేళ్లలోనే దాదాపు 25 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం కూడా భోజ్‌పురి చిత్రసీమలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం మరోసారి సినీ పరిశ్రమలో కొత్త చర్చకు తెరతీశాయి.