ఇస్లామాబాద్‌లో బుల్లెట్ల మోత.. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో పాక్ ఇంటెలిజెన్స్ అధికారిని హతం!

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ హత్య దేశ భద్రతా వ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్‌ను ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ వెలుపల గుర్తుతెలియని వ్యక్తి పట్టపగలు కాల్చిచంపడం సంచలనంగా మారింది. అసిమ్ తారిఖ్ పాకిస్తాన్ వైమానిక దళ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వైమానిక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇస్లామాబాద్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో కూడా ఉన్నతాధికారులకు రక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీసులు వెల్లడించిన కథనం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ యువకుడు ఒక యువతిని బలవంతంగా తన బైక్‌పై ఎక్కించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. దీనిని గమనించిన అసిమ్ తారిఖ్ తన కారును అక్కడ ఆపి యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో హెచ్చరించిన అనంతరం అసిమ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, నిందితుడు బైక్‌పై వెంబడించి కారు వద్దకు చేరుకుని కాల్పులు జరిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో అసిమ్ తారిఖ్ అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు.
అయితే ఈ కథనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలంలో నమోదైన సీసీటీవీ, వీడియో దృశ్యాల్లో అసిమ్ తారిఖ్ కారు నుంచి దిగినట్లు కనిపించకపోవడం, ఆయన సీట్‌బెల్ట్ ధరించి ఉండటం పోలీసుల వాదనపై సందేహాలకు తావిస్తోంది. ఒకవేళ ఆయన కారు దిగకపోతే యువతి అపహరణను ఎలా అడ్డుకునేందుకు ప్రయత్నించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ హత్య వెనుక వాస్తవ కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతడు ఓ షోరూమ్‌లో పనిచేస్తూ మహిళలను తరచూ వేధించేవాడని, కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువతిని బలవంతంగా తన బైక్‌పై ఎక్కించేందుకు ప్రయత్నించే సమయంలో జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణమైందని పోలీసులు తెలిపారు. అయితే ఈ వివరణను పలువురు భద్రతా విశ్లేషకులు పూర్తిగా నమ్మడం లేదు.
గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి ఉగ్రవాదులు, భద్రతా వ్యవస్థకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దళ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన సీనియర్ అధికారే రాజధానిలో హత్యకు గురికావడం పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు మరో పెద్ద సవాలుగా మారింది. ఈ ఘటన వెనుక వ్యక్తిగత వివాదమా, లేక ప్రణాళికాబద్ధమైన లక్ష్యహత్యా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు హత్యకు గల అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..