ఈసారి వర్షాలు తక్కువైతే ధరలు పెరుగుతాయ్.. వాటి అమ్మకాలు పడిపోతాయన్న S&P రిపోర్ట్

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించినంతగా కురవకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని రేటింగ్ సంస్థ ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. సాధారణ సగటుతో పోలిస్తే ఈసారి వర్షపాతం కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ.. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ప్రభుత్వ ఆర్థిక భారం అధికమయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ఆహార ధరలే ప్రధాన కారణం..
వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం నేరుగా ఆహార ధరలపై పడుతుందని ఎస్&పీ వెల్లడించింది. ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచీలో ఆహార పదార్థాల వాటా ఎక్కువగా ఉండటంతో, వర్షాభావం ద్రవ్యోల్బణాన్ని వేగంగా పెంచే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం 3.9 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం 2026-27 ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆహారంతో పాటు ఇంధన ధరలు కూడా పెరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని వెల్లడించింది.
గ్రామీణ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం..
బలహీన రుతుపవనాల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. రైతుల ఆదాయం తగ్గడం వల్ల ట్రాక్టర్లు, అగ్రో కెమికల్స్, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని ఎస్&పీ విశ్లేషించింది. గతంలో బలహీన వర్షాల సమయంలో ట్రాక్టర్లు, వ్యవసాయ రసాయనాల అమ్మకాలు దాదాపు 10 శాతం వరకు తగ్గినట్లు గుర్తుచేసింది. అలాగే ద్విచక్ర వాహనాల విక్రయాలు 5 నుంచి 10 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు 2 నుంచి 5 శాతం వరకు పడిపోవచ్చని పేర్కొంది.
ప్రభుత్వంపై పెరగనున్న భారం..
వర్షాభావం తీవ్రంగా ఉంటే ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలు, ఆహార సబ్సిడీలు పెంచడంతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరిన్ని నిధులు కేటాయించాల్సి రావచ్చని ఎస్&పీ తెలిపింది. ఇది ప్రభుత్వ ఆర్థిక లోటు నియంత్రణ లక్ష్యాలపై ఒత్తిడి పెంచే అవకాశముందని హెచ్చరించింది. అయితే ప్రభుత్వ ఆహార నిల్వలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి పథకాలు ఈ ప్రభావాన్ని కొంత మేర తగ్గించగలవని అంచనా వేసింది.
ALSO READ : SIP చేస్తున్నారా? ఏ మ్యూచువల్ ఫండ్ అన్నది కాదు..
బ్యాంకులకు పరిమిత ప్రభావమే..
వ్యవసాయంపై ఆధారపడిన రుణాల్లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ.. బ్యాంకింగ్ రంగం ఈ పరిస్థితిని ఎదుర్కోగలదని ఎస్&పీ అభిప్రాయపడింది. అయితే గ్రామీణ రుణగ్రహీతలపై ఎక్కువగా ఆధారపడే మైక్రోఫైనాన్స్ సంస్థలు మాత్రం ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు సాగునీటి విస్తరణ, పంట బీమా, కనీస మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీలు వంటి సంస్కరణలు గతంతో పోలిస్తే పరిస్థితిని కొంత మెరుగ్గా నిలబెడతాయని ఎస్&పీ అంటోంది. మెుత్తానికి ఈ ఏడాది రుతుపవనాల తీరు భారత ఆర్థిక వ్యవస్థకు కీలక పరీక్షగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.