త్వరలో ములుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.మేడారం పనులపై మంత్రి సీతక్క సీరియస్

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ములుగు, మేడారం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో ఇవాళ కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా మేడారం అభివృద్ధి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను రాబోయే 10 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లాలో పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఘట్టమ్మ సమీపంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ALSO READ : తిరుమల వెంకన్నను దర్శించుకున్న 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు !
ఈ పర్యటనలోనే ములుగు కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం లాంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అధికారిక తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.