July 6, 2026

మధ్య తరగతి జీవిత దర్పణం.. కోరికలే దుఃఖానికి కారణం

మధ్య తరగతి జీవిత దర్పణం.. కోరికలే దుఃఖానికి కారణం
Reading Time: 2 minutes

మధ్య తరగతి జీవిత దర్పణం.. కోరికలే దుఃఖానికి కారణం

Caption of Image.

మధ్య తరగతి జీవితం త్రిశంకు స్వర్గం. ఇక్కడ సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి. కాకపోతే, వీటిలో ఏది ఎక్కువ పొందాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనుషులే. కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా బతుకును సంతోషంగా మలచుకోవడమా? లేక కష్టాలపాలు చేసుకోవడమా? అనేది వాళ్ల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. 

దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఎక్కువ భాగం మధ్య తరగతి కుటుంబాలు కష్టాల బాటలోనే వెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు స్వార్థం, అత్యాశ. ఇలాంటి స్వార్థ జీవుల మాయలో పడి అత్యాశ వలలో చిక్కి విలవిలలాడిన ఓ మధ్య తరగతి మనిషి జీవితం చివరికి ఏమైందో చెప్పేదే ‘ఏది సుఖం? ఏది దుఃఖం’ నవల. రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య. 

సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని రచనలు చేయడంలో పేరుపొందిన రచయితల్లో కాలువ మల్లయ్య ఒకరు. వందలాది కథలు, వ్యాసాలు, పదుల సంఖ్యలో నవలలు రాసిన ఆయన.. తెలంగాణ పల్లె జీవితాలను, అసమానతలను, దళిత – బహజన, స్త్రీల వెతలను అక్షరీకరించడంలో సిద్ధహస్తులు. అందుకే ఆయన రచనలు పాఠకాదరణ పొందాయి. ‘ఏది సుఖం? ఏది దుఃఖం’ నవల కూడా ఇదే కోవకు చెందుతుంది. 

‘కోరికలే దుఃఖానికి కారణాలు’ అన్నాడు బుద్ధుడు. వాటిని జయిస్తేనే శాంతి, సుఖం అని కూడా చెప్పాడు. ఈ నవల కూడా అంతర్లీనంగా అదే తత్వాన్ని బోధిస్తుంది. కాకపోతే ఇందులో కష్టాలు మాత్రం కథానాయకుడు శివయ్యవి. 

కోరికలు ఆయన తల్లివి, భార్యవి. అలాగని ఇందులో శివయ్య తప్పేమీ లేదా? అంటే ఉంది. ఉన్నత చదువులు చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదర్శభావాలు ఉన్నాయి. అయినా.. తల్లి, భార్య మాటలకు లొంగిపోయాడు. వాళ్ల కోరికలను కాదనలేక, వాటిని నెరవేర్చే ప్రయత్నంలో తప్పటడుగులు వేశాడు. ఆశకు, అత్యాశకు మధ్య తేడా తెలుసుకోలేక కష్టాల సుడిగుండంలో చిక్కాడు. మేలుకోరే మిత్రుడు హెచ్చరిస్తున్నా వినకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చివరికి కూతుళ్ల మాటలతో కళ్లు తెరుచుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదీ స్థూలంగా నవల సారాంశం.  

నవలలోని పాత్రలన్నీ చాలా సహజంగా ప్రవర్తిస్తాయి. కొడుకు తన మాట వినాలనుకునే తల్లులు, భర్తను కొంగుకు కట్టేసుకోవాలనుకునే కోడళ్లు ఇప్పటికీ సమాజంలో కనిపిస్తారు. వీళ్ల మధ్య నలిగిపోయే శివయ్య లాంటి కొడుకు/భర్త పాత్రలూ కోకొల్లలు. ఇక, ఇందులోని మరో ముఖ్యపాత్ర.. శివయ్యకు మామగా మారిన మేనమామ. నిలువెల్లా స్వార్థం నింపుకుని, లౌక్యంతో తన పనులు చక్కబెట్టుకునే ఇలాంటి వ్యక్తులు మనకు నిజ జీవితంలో తారసపడుతూనే ఉంటారు. అందుకే ఈ నవల చదువుతుంటే అందులోని సంఘటనలు, వ్యక్తులు మనకు తెలిసినట్లే అనిపిస్తుంది. 

శివయ్య పాత్ర ‘అసమర్థుని జీవితయాత్ర’ను గుర్తుచేసినా, ముగింపుతో ఆ భావనను రచయిత చెరిపేశారు. ‘చైతన్య స్రవంతి’లో సాగే కథాగమనం ఆకట్టుకుంటుంది. భాష అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. సంభాషణల్లో సహజత్వం కనిపిస్తుంది. సందర్భానికి తగినట్లు వాడిన సామెతలు, సూక్తులు సరిగా కుదిరాయి. అక్కడక్కడా కథానాయకుడి అంతర్మథనం సుదీర్ఘంగా సాగడం మాత్రం పఠనవేగానికి కాస్త కళ్లెం వేస్తుంది.     

దాదాపు ఇరవయ్యేళ్ల కిందట ‘స్వాతి’ మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చినా ఇప్పటికీ తాజాగా కనిపించడానికి కారణం ఇందులోని కథాంశమే. ఇందులో.. కట్నం, వారసుడిగా మగపిల్లాడు కావాలనుకోవడం, నమ్మినవాళ్లను మోసగించడం వంటివి ఇప్పటికీ సమాజాన్ని వదలకుండా పట్టి పీడిస్తుండడం చూస్తున్నది/వింటున్నదే. షేర్లు, ఫైనాన్షియల్ ఉచ్చులు, ఇప్పటి జెన్ జీ తరం ఆలోచనలను కూడా రచయిత అప్పట్లోనే పసిగట్టి, ఒడుపుగా వాడడం ఆశ్చర్యపరుస్తుంది. మధ్య తరగతి జీవితాల్లోని సుఖదుఃఖాలకు దర్పణం పట్టే ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవొచ్చు. 

‌‌- జి. మహేశ్వర్​

లైఫ్​ & లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com
 

©️ VIL Media Pvt Ltd.