ఆదిలాబాద్లో వెరైటీ దొంగ.. అంజన్న కండ్లు కొట్టేసి.. పోతూ పోతూ సుద్దపూసలాగా ఆ మొక్కుడేందిరయ్యా !

ఈ దొంగను ఏం అనాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏకంగా అంజన్న వెండి కండ్లనే కొట్టేసి.. మళ్లీ క్షమించు సామీ అన్నట్లుగా ఓ మొక్కు మొక్కి వెళ్లటం చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆదిలాబాద్ 24 వ వార్డు, భాగ్యనగర్ లో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం (జులై 05) మధ్యాహ్నం 3గంటల 20 నిమిషాల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. బైక్ పైన వచ్చి ఈ దొంగ నక్కి నక్కి చూస్తూ ఆలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ వెరూ లేరని నిర్ధారించుకుని.. తాళం వేసి ఉన్న తలుపులను లాగి గర్భ గుడి లోపలికి ప్రవేశించాడు.
ఆంజనేయ స్వామి విగ్రహం వెండి కండ్లు దొంగిలించి మళ్లీ ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయాడు. అయితే వెళ్లే సమయంలో తను చేసింది దొంగతనం అని మరిచాడా.. లేక సుద్దపూస అనుకున్నాడా అర్థం కాలేదు. ఏమీ ఎరుగనట్లు ఓ మొక్కు మొక్కి వెళ్లటం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. వీడేం దొంగరా బాబూ అనుకునేలా అతివినయం చూస్తే నవ్వురాక మానదు.
►ALSO READ | ఇంటర్ అమ్మాయిని అమ్మ తీసుకురమ్మందని చెప్పి కిడ్నాప్.. నలుగురిపై పోక్సో కేసు
సాయంత్రం పూజా కార్యక్రమాల కోసం వచ్చిన అర్చకుడు.. స్వామి కండ్లు కనిపించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. ఆలయ కమిటీ సభ్యులకు తెలపడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.