అమెరికా ఎప్పుడూ అగ్రస్థానంలోనే.. పడిపోవడానికి వీల్లేదు.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్

- ఘనంగా అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాలు
- న్యూయార్క్‌లో నౌకల ప్రదర్శన, వైమానిక విన్యాసాలు..
వాషింగ్టన్: అమెరికాలో 250వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు చేసి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అమెరికాలో 250 ఏండ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘క్వార్టర్ మిలీనియం’ ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. న్యూయార్క్‌లో యుద్ధ విమానాల విన్యాసాలు, హడ్సన్ నదిపై బ్లూ ఏంజెల్స్ జెట్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి.
వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో భారీ వర్షం, మెరుపులతో కూడిన తుఫాను కారణంగా దాదాపు 2 గంటల పాటు ఉత్సవాలకు అంతరాయం కలిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణం శాంతించిన అనంతరం పునఃప్రారంభమైన సభలో ట్రంప్ ప్రసంగించారు. ఈ ఉత్సవాలను దేశ చరిత్రలోనే అత్యంత ఆనందదాయకమైన, అత్యున్నతమైన ఘట్టంగా అభివర్ణించారు.
దేశ రక్షణలో ప్రాణాలు సైతం లెక్కచేయని వీరులను ఆయన స్మరించుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ పోరాట యోధులు, వియత్నాం యుద్ధంలో పాల్గొన్న తొలి నల్లజాతీయుడైన ప్రత్యేక దళ (స్పెషల్ ఫోర్సెస్) కమాండర్‌ను వేదికపై సన్మానించారు. చరిత్రాత్మక సందర్భాలకు సాక్ష్యాలుగా నిలిచిన.. అబ్రహం లింకన్ శవపేటికపై ఉంచిన జెండాతో పాటు రైట్ బ్రదర్స్ తాము నడిపిన విమానంలో వాడిన జాతీయ జెండాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
‘‘మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటాం. మన దేశం ఎప్పటికీ పడిపోవడానికి వీల్లేదు. మనమే ఎప్పుడూ అత్యుత్తమంగా నిలుస్తాం”అని ట్రంప్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రసిద్ధ గాయకుడు లీ గ్రీన్‌వుడ్ ‘గాడ్ బ్లెస్ అమెరికా’ గీతంతో ట్రంప్‌కు స్వాగతం పలికారు. కాగా, ఈ వేడుకల బాధ్యతలను కాంగ్రెస్ నియమించిన ద్వైపాక్షిక కమిటీ స్థానంలో, పూర్తిగా వైట్ హౌస్ అనుకూల వర్గాలే నిర్వహించడం విశేషం.
- జాతీయ వేదికపై రాజకీయ ఎజెండా
దేశవ్యాప్తంగా నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత రిపబ్లికన్ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న వివాదాస్పద ఎన్నికల బిల్లు ‘సేవ్ అమెరికా యాక్ట్’కు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
అలాగే, అమెరికా పౌరుల ఆయుధ హక్కులను (సెకండ్ అమెండ్‌మెంట్) గట్టిగా సమర్థించారు. కమ్యూనిజంపై తన పాత విమర్శలను మరోసారి తెరపైకి తెచ్చారు. అలాగే, అధ్యక్ష భాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఇది మూడోసారి అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం రెండోసారి.
అయినప్పటికీ.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ తన విజయాన్ని దోచుకున్నారని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే నవ్వుకుంటూ వివాదాస్పద అంశాల జోలికి పోవాలనుకోవట్లేదంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
- దేశవ్యాప్తంగా సంబురాలు
దేశవ్యాప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. న్యూయార్క్ హార్బర్‌లో 43 భారీ నౌకల ప్రదర్శనతో పాటు స్టెల్త్ బాంబర్, నావికాదళ ‘బ్లూ ఏంజిల్స్’, ఫ్రాన్స్ వైమానిక విమానాలు గగనతలంలో చేసిన రంగురంగుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.