Reading Time: < 1 minute

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పరిశీలన

Caption of Image.
  • కాజీపేట ఆర్‌ఎమ్‌యూ, చర్లపల్లి టెర్మినల్ పనులను తనిఖీ చేసిన రైల్వే బోర్డు చైర్మన్

హైదరాబాద్ సిటీ: రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్ కుమార్ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించి పలు రైల్వే ప్రాజెక్టులను పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ వాత్సవ్, సికింద్రాబాద్ డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. తొలిరోజు సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన ఆయన, మరుసటి రోజు కాజీపేటలో రూ.597.68 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎమ్ యూ) పనులను సమీక్షించారు.

ఇందులో భాగంగా మెయిన్ షెడ్, బోగి, పెయింట్, వీల్ షాపులను తనిఖీ చేసి, పనుల ప్రయోజనాలను మీడియాకు వివరించారు. అనంతరం జనగాం అమృత్ స్టేషన్ పనులను, చర్లపల్లిలోని కొత్త రైలు టెర్మినల్‌లో ట్రాక్‌లు, ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు.ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన చైర్మన్, స్వదేశీ యాంటీ-కొలిజన్ సిస్టమ్ ‘కవచ్ 4.0’ అమలు తీరుపై అధికారుల పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను వీక్షించారు. అనంతరం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

©️ VIL Media Pvt Ltd.