July 6, 2026

Aditya Dhar: ‘నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్‌వి’: రణ్‌వీర్ సింగ్‌పై ‘ధురంధర్’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!

Aditya Dhar: ‘నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్‌వి’: రణ్‌వీర్ సింగ్‌పై ‘ధురంధర్’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
Reading Time: 2 minutes
Ranveer Singh Aditya Dhar Dhurandhar Birthday Post

Aditya Dhar: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ బర్త్‌డే సందర్భంగా ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. రణ్‌వీర్ సింగ్ కేవలం అసాధారణమైన నటుడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మానవతావాది అని ఆయన కొనియాడారు. ‘ధురంధర్’ సినిమా తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమని చెబుతూ.. షూటింగ్ సెట్స్‌లో రణ్‌వీర్ చూపించిన నటనా విశ్వరూపాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్!

“కొన్ని సినిమాలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. నా కెరీర్‌లో ‘ధురంధర్’ అలాంటి చిత్రమే. రణ్‌వీర్ ఒక అద్భుతమైన నటుడని నాకు ముందే తెలుసు. కానీ ఈ సినిమా జర్నీలో ఆయనలోని నటుడితో, అతని వ్యక్తిత్వంతో నేను ప్రేమలో పడ్డాను. ఈ సినిమాలో రణ్‌వీర్ చేసిన నటన భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిపోతుంది. అది కేవలం నటన కాదు.. ఒక ప్రవాహం” అంటూ ఆదిత్య ధర్ రణ్‌వీర్ సింగ్‌ను కొనియాడారు. ధురంధర్ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లను ప్రస్తావిస్తూ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యంగా 26/11 సీక్వెన్స్, క్లైమాక్స్ టీ షాప్ సీన్, పఠాన్‌కోట్ మారణహోమం, పంప్ హౌస్ సీన్, కోర్టు ఎక్స్‌టీరియర్ సీన్స్ చేస్తున్నప్పుడు.. చాలా అరుదైన నటనను నేను కళ్లారా చూశాను. ఏ ఒక్క సీన్‌లోనూ రణ్‌వీర్ ఈజీ ఆప్షన్ తీసుకోలేదు. ప్రతి ఎమోషన్, ప్రతి సైలెన్స్ పర్ఫెక్ట్‌గా పండాయి. ఆ కన్సిస్టెన్సీ చూస్తుంటే.. సాక్షాత్తూ ఆ సరస్వతీ దేవి తన చేతిని రణ్‌వీర్ తలపై పెట్టి దీవించిందా? అన్నట్లు అనిపించింది. ఒక దర్శకుడిగా నా కెరీర్ మొత్తం ఇలాంటి క్షణాల కోసమే ఎదురుచూశాను” అని పేర్కొన్నారు.

షూటింగ్ సమయంలో తమ ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం గురించి చెబుతూ.. “యాక్షన్, కట్ మధ్య జరిగిన సంభాషణలు, ప్రతి సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం పడిన తపన నా హృదయానికి దగ్గరయ్యాయి. ఆ ప్రయాణంలో రణ్‌వీర్ కేవలం నా హీరోగానే మిగిలిపోలేదు.. నా సొంత బ్రదర్‌గా మారిపోయాడు. నా హృదయాన్ని, నా క్రాఫ్ట్‌ను, నాలోని పిచ్చిని నమ్మి నిన్ను నా చేతుల్లో పెట్టినందుకు థాంక్యూ బ్రదర్. మనం కలిసి సృష్టించిన ఈ సినిమాను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే మై బ్రదర్.. లవ్ యూ ఆల్వేస్” అంటూ ఆదిత్య ధర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ నోట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.