July 6, 2026

US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!

US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
Reading Time: 2 minutes
Us Iran Talks Islamabad Pakistan July 11 Nuclear Sanctions Meeting

ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్‌ను తదుపరి సమావేశానికి అనువైన వేదికగా ఎంపిక చేసినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జూలై 11 తేదీని పరిశీలిస్తున్నప్పటికీ.. ఇరాన్‌లోని తాజా పరిణామాలను బట్టి తుది తేదీ మారే అవకాశం ఉందని సమాచారం.

దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్‌కు చెందిన సాంకేతిక బృందాల మధ్య జరిగే తదుపరి సమావేశానికి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను ప్రాధాన్య వేదికగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. “తదుపరి దశ చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే అవి జూలై 11న జరుగుతాయా? లేక ఆ తర్వాత జరుగుతాయా? అనేది ఇంకా ఖరారు కాలేదు” అని ఆయన తెలిపారు. ఇరు దేశాల షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రక్రియలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్‌లతో పాటు సంబంధిత దౌత్య ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఏర్పడిన చర్చల వాతావరణాన్ని కొనసాగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, స్తంభింపజేసిన (Frozen) ఇరాన్ ఆస్తుల విడుదల, ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్, విస్తృత శాంతి ఒప్పందానికి అవసరమైన దౌత్య చర్యలు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఇతర ప్రముఖుల అంత్యక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం కూర్పుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జూలై 9న అంత్యక్రియలు ముగిసిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తదుపరి దశ అమెరికా-ఇరాన్ చర్చల తేదీ లేదా వేదికపై ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పాకిస్థాన్ కూడా తాము ఆతిథ్యం ఇస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లామాబాద్‌నే ప్రాధాన్య వేదికగా పరిగణిస్తున్నట్లు దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశం పాకిస్థాన్‌లో జరిగితే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల్లో ఇస్లామాబాద్ మరోసారి కీలక పాత్ర పోషించినట్లవుతుంది.