మనవడి మరణం తట్టుకోలేక ఆగిన తాత గుండె.. ఈ కుటుంబ కథ తెలిస్తే కన్నీళ్లే..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసు ఆ కుటుంబంలో తీరని ఆవేదనను మిగిల్చింది. కాబోయే భార్య చేసిన ఘోరానికి బలైన కేతన్ మరణాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనతో అతని తాత దేవీచంద్ అగర్వాల్ శనివారం సాయంత్రం పుణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఒకే నెలలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో అగర్వాల్ కుటుంబం కోలుకోలేని విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి లోయలోకి నెట్టేసి కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణం జరిగిన రోజు నుంచే తాత దేవీచంద్ తీవ్రమైన మానసిక షాక్‌లోకి వెళ్లిపోయారు. కళ్లముందే ఎదిగిన మనవడి జ్ఞాపకాలతోనే రోజులు గడిపిన ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
క్యాండిల్ ర్యాలీలో కన్నీటి పర్యంతం
జూన్ 27న కేతన్‌కు న్యాయం చేయాలని కోరుతూ పూణేలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా దేవీచంద్ పాల్గొన్నారు. ‘‘ఎన్నేళ్లుగానో నమ్మిన వారే మా వెన్నుపోటు పొడిచారు. నా మనవడి ప్రాణాలు తీశారు. మాకు న్యాయం జరగాలి’’ అంటూ ఆనాడు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని చనిపోయే వరకు ఆయన తపించారు.
నిందితులకు 14 రోజుల రిమాండ్
ఈ కేసు దర్యాప్తును పూణే పోలీసులు ముమ్మరంగా జరుపుతున్నారు. ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత ప్రధాన నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను వాద్గావ్ మావల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల కస్టడీని పొడిగించాలన్న పోలీసుల డిమాండ్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. ఇద్దరు నిందితులకు 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ జైల్లోనే ఉండగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.