పార్టీకి దూరంగా లేను.. నిర్ణయాలనే తప్పుపడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- మొదటినుంచి పార్టీలో ఉన్న వారికి ..
- అన్యాయం జరుగొద్దనే మా ఆలోచన
చౌటుప్పల్, వెలుగు : ‘పార్టీలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పు పడుతున్నానే కానీ పార్టీకి ఎప్పుడు దూరంగా లేను, తప్పనిసరి పరిస్థితుల్లోనే యాదగిరిగుట్ట విషయం మాట్లాడాల్సి వచ్చింది. అది పార్టీ మీద వ్యతిరేకమో.. ప్రభుత్వం మీద వ్యతిరేకమో కాదు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ మానవత్వం కలిగిన వ్యక్తి అని, భవిష్యత్ లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆయనతో చర్చించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల మనసులో ఏముంది,
వాళ్లకు ఏం చేయాలన్న విషయంపైనే ఆలోచన చేస్తున్నామన్నారు. కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలను కాపాడుకొని, రాబోయే ఐదేండ్లలో పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగదాల పావని రమేశ్ గౌడ్, మునుగోడు ఎన్నికల ఇన్ చార్జి పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ పాల్గొన్నారు.