Reading Time: < 1 minute
Hyderabad Cp Sajjanar Kbr Park One Way Traffic Inspection

CP VC Sajjanar : కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో నూతనంగా అమలులోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ ఆయన క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

రెండు సార్లు బైక్‌పై తిరిగి క్షేత్రస్థాయి పర్యవేక్షణ

రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు సీపీ సజ్జనర్ రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ మార్గంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కూడా మరోసారి వెళ్లి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. ఈ క్రమంలో అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి అక్కడ నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సాఫీగా సాగుతున్న వన్‌వే.. నగరవాసులు సహకరించాలి

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఈ విధానాన్ని ప్రారంభించిన తొలిరోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయని చెప్పారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు ఆయన వివరించారు.

అలాగే జీహెచ్‌ఎంసీ , నిర్మాణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే సూచనలను పాటించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.