Reading Time: 2 minutes

మానవత్వం చాటుకున్న అనంత్ అంబానీ: వింత వ్యాధితో బాధపడుతున్న యువకుడికి వైద్య సాయం

Caption of Image.

నీటిలో గంటల తరబడి గడపడం అనేది వినటానికి కొంత వింతగా అనిపించవచ్చు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఇక్బాల్ అనే యువకుడికి అది ఒక అనివార్యమైన నరకం. ఎందుకంటే ఒళ్లంతా మంటలు పుడుతున్నాయని, ఎవరో తనను ఆవహించినట్లు అనిపిస్తోందని.. పగలు, రాత్రులు తేడా లేకుండా నీటి చెరువుల్లో గడిపే ఓ యువకుడి దీనస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఈ వింత పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతుండగా.. వారికి ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ అండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ అండగా నిలిచారు.

సాధారణంగా ఇలాంటి వింత పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి నవ్వుకోవడం లేదా పట్టింకుకోకుండా వదిలేస్తుంటాం. కానీ ఇక్బాల్ పరిస్థితిని చూసి చలించిపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇక్బాల్‌ను ముంబైకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు.

ఇక్బాల్‌ను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి, ప్రతిష్టాత్మకమైన సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఇక్బాల్‌కు అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేక సరైన చికిత్స అందక ఇబ్బంది పడిన ఇక్బాల్‌కు.. ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం అందడం విశేషం.

నిరంతరం నీటిలోనే గడపడం వల్ల చర్మం పాడైపోవడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం మెత్తబడి, బ్యాక్టీరియల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున్న వైద్యులు ఇక్బాల్‌ను ఆ పరిస్థితి నుంచి బయటపడేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా.. ఒక ప్రాణాన్ని కాపాడటానికి అనంత్ అంబానీ చూపిన మానవత్వంపై ఇప్పుడు అందరి ప్రశంసలు వస్తున్నాయి.

ఒక వైపు వైద్యులు ఇక్బాల్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమిస్తుంటే.. మరోవైపు ఈ యువకుడికి కొత్త జీవితం దక్కుతుందన్న నమ్మకం అతని తల్లిదండ్రుల్లో మొదలైంది. అనంత్ అంబానీ చేసిన ఈ సాయం కేవలం ఒక చికిత్సకే పరిమితం కాకుండా.. సమాజంలో అభాగ్యులకు అండగా ఉండేవారు ఉన్నారని మరోసారి నిరూపించింది. ఆసుపత్రిలో ఇక్బాల్ కోలుకుంటున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే అతను మళ్లీ సాధారణ యువకుడిగా తిరిగి వస్తాడనే ఆశ కనిపిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.