Reading Time: < 1 minute

కబ్జా భూములు పేదలకు పంచుతాం..అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Caption of Image.

ఖమ్మం రూరల్, వెలుగు: కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని, అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. బుధవారం ఖమ్మం రూరల్  మండలం పల్లెగూడెంలో జీపీ బిల్డింగ్​ను ప్రారంభించారు.

 కూసుమంచిలో 12 మంది దివ్యాంగులకు పూర్తి సబ్సిడీపై ట్రై మోటార్  సైకిళ్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరీ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని, ఇందులోభాగంగా భూములను సమీకరించి ఇళ్ల స్థలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 

పల్లెగూడెం అభివృద్ధికి రూ.61.76 కోట్ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అంగన్​వాడీ భవన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

22ఏ సమస్యకు పరిష్కారం చూపుతున్నం

హైదరాబాద్: 22ఏ  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరగా తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. 

బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి 22ఏ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, స్టాంప్స్  అండ్  రిజిస్ట్రేషన్  శాఖ కమిషనర్  రాజీవ్  గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

22ఏ జాబితాలో ఉంటే తిరస్కరించకుండా ప్రతి కేసును నిశితంగా పరిశీలించి రిజిస్ట్రేషన్​ చేయాలన్నారు. నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.