
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త. సనత్ నగర్ టిమ్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఈ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అన్నీ సేవలు ప్రారంభించనున్నారు. ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు ప్రారంభమవ్వగా.. భారీగా స్పందన వస్తోంది. ట్రయల్ రన్ సమయంలో రోజుకు 200 మంది వరకు హాస్పిటల్‌కు రాగా.. బుధవారం నాటికి ఈ సంఖ్య 700 దాటింది. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు సేవలు అందిస్తున్నారు.
రేపటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు
శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ఆస్పత్రిని ప్రారంభించిన సందర్బంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో సందర్శకులు రావడంతో బ్యాక్టీరియా ఇన్పెక్షన్ ముప్పు ఏర్పడే అవకాశముంది. దీంతో సిబ్బంది హాస్పిటల్ మొత్తం ప్యూమిగేషన్ ప్రాసెస్ చేపట్టారు. గురువారంతో ప్యూమిగేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. శుక్రవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే త్వరలో రెండో దశ ప్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తై బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్లు ప్రారంభిస్తారు. అయితే ఆపరేషన్లు ప్రారంభం కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.
నిమ్స్ తరహాలో చార్జీలు
పేదలకు అత్యున్నత కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ హాస్పిటల్‌ను నిర్మించింది. కార్పొరేట్ ఆస్పత్రులను తలపించే విధంగా దీని నిర్మాణం చేపట్టారు. మొత్తం 1082 పడకలు ఉండగా.. 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఓపీ, ఐపీ సేవలు ప్రారంభమవ్వగా.. రెండు, మూడు వారాల్లో సర్జరీలు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఆస్పత్రిని దాదాపు రూ.1126 కోట్లతో నిర్మించగా.. 2360 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు వసూలు చేస్తారు. నాలుగు బ్లాకులుగా ఈ హాస్పిటల్ నిర్మించారు. అలాగే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీని వల్ల మెడికల్ టెస్టులు రెండు నిమిషాల్లోనే పూర్తవుతాయి. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రో బయాలజీ ల్యాబ్, 10 బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.