
Tata Sons AGM: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం జరగాల్సిన వార్షిక సాధారణ సమావేశం (AGM) అవసరమైన కోరం లేకపోవడంతో వాయిదా పడింది. టాటా సన్స్ చరిత్రలో AGM ఈ కారణంగా వాయిదా పడటం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబయిలోని బాంబే హౌస్‌లో AGM నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కొంతమంది వాటాదారులు ఆన్‌లైన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అయితే టాటా సన్స్‌లో కీలక వాటా కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT)కు మహారాష్ట్ర చారిటీ కమిషనర్ నుంచి అవసరమైన అనుమతి లేకపోవడంతో ఉమ్మడి ప్రతినిధి AGMకు హాజరుకాలేరని కంపెనీకి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య అయిన కోరం పూర్తికాలేదు. SRTTపై చారిటీ కమిషనర్ విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. టాటా సన్స్‌లో SRTT, SDTTలకు కలిపి 51.54 శాతం వాటా ఉంది. ఇందులో SRTTకు సుమారు 23.5 శాతం, SDTTకు దాదాపు 28 శాతం వాటా ఉన్నట్లు సమాచారం.
చంద్రశేఖరన్ పదవిపై ఆసక్తి
AGM వాయిదా పడటంతో టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పదవిపైనా ఉత్కంఠ నెలకొంది. రొటేషన్ పద్ధతిలో ఆయన డైరెక్టర్ పదవి నుంచి రిటైర్ కావాల్సి ఉంది. అయితే కోరం లేక AGM సక్రమంగా జరగకపోతే.. తదుపరి సరైన AGM జరిగి, ఆయన పునర్నియామకంపై నిర్ణయం తీసుకునే వరకు డైరెక్టర్‌గా కొనసాగుతారని కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సిన డైరెక్టర్ సంబంధిత AGM జరిగే వరకు పదవిలో కొనసాగుతారు. ఆ సమావేశంలో వాటాదారులు ఆయనను తిరిగి నియమించాలా లేదా ఖాళీని భర్తీ చేయాలా అనే నిర్ణయం తీసుకోవాలి. అయితే కోరం లేక AGM నిర్వహణే సాధ్యం కాని పరిస్థితిలో చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే అంశంపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోంది.
టాటా సన్స్‌లో ట్రస్టుల వాటా
SRTT, SDTTలు టాటా సన్స్‌లో ప్రధాన నియంత్రణ వాటాదారులుగా ఉన్నాయి. రెండు ట్రస్టులకు కలిపి 51.54 శాతం వాటా ఉండటంతో AGMలో వాటి ప్రతినిధుల హాజరు కీలకంగా మారింది. SRTT బోర్డు ఏర్పాటు, మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను పాటించలేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో చారిటీ కమిషనర్ ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఈ సమస్య పరిష్కారం కోసం టాటా ట్రస్టులకు చెందిన కొంతమంది ట్రస్టీలు వ్యక్తిగతంగా చారిటీ కమిషనర్‌ను సంప్రదించి ఉపశమనం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. చంద్రశేఖరన్ 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ బోర్డులో చేరగా.. 2017 జనవరిలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. చైర్మన్‌గా కొనసాగాలంటే ఆయన డైరెక్టర్‌గా కూడా కొనసాగాల్సి ఉంటుంది. అయితే 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి నియామకం కోరబోనని చంద్రశేఖరన్ ఇప్పటికే వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో AGM వాయిదా పడటం, తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుంది? చంద్రశేఖరన్ డైరెక్టర్‌గా ఎంతకాలం కొనసాగుతారు? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.