Reading Time: < 1 minute
Tirumala Hundi Income Crosses Rs 6 Crore After 3 Years

TTD Hundi Income August 18 2026: తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటింది. మంగళవారం (ఆగష్టు 18) ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భారీగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.

మరోవైపు టీటీడీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం 2026 జూలైలో నమోదైంది. ఆ నెలలో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల ఆదాయం సమకూరింది. జూలైలో దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో.. హుండీకి కూడా పెద్ద మొత్తంలో కానుకలు వచ్చాయి.

ఆగస్టు నెలలోనూ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో.. టోకెన్లు లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న (ఆగష్టు 18) శ్రీవారిని మొత్తం 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానికి భారీ సమయం పడుతున్నప్పటికీ.. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నెలలో భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జూలైలో నెలవారీ హుండీ ఆదాయం రికార్డు సృష్టించగా.. తాజాగా ఒక్కరోజులోనే రూ.6.12 కోట్ల ఆదాయం రావడం శ్రీవారిపై భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.