
బషీర్‌బాగ్, వెలుగు : ఇటీవల జరిగిన ఉత్తమ వార్తా ఫొటోగ్రఫీ పోటీల్లో ‘వెలుగు’ చీఫ్ ఫొటోగ్రాఫర్ జెల్లా నవీన్ కు అవార్డు దక్కింది. 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన పోటీల్లో ఆయనకు కన్సోలేషన్ బహుమతి లభించింది.
మేడారం జాతర సందర్భంగా ఎడ్ల బండ్లపై సమ్మక్క -సారలమ్మ దర్శనానికి వస్తున్న భక్తుల ఫొటోకు ఈ బహుమతి వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 102 మంది ఫొటో జర్నలిస్టులు పోటీలో పాల్గొన్నారు.
ఫొటో జర్నలిస్టుల్లోని ప్రతిభను వెలికి తీసి, వారిని ప్రోత్సహించేందుకు ప్రతి యేటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కేఎన్.హరి తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో విజేతల వివరాలను వెల్లడించారు.