
- పెట్రోల్, డ్రైవర్‌కు రూ. 75 వేలు
చెన్నై: తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం జోసెఫ్‌విజయ్ బొనాంజా ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కారు ఫ్యూయెల్, డ్రైవర్, మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 75 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే, ప్రతి ఎమ్మెల్యేకు ఓ సెక్రటరీ ఉండాలని, అందుకోసం రూ. 25 వేలు కేటాయించనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పనులను సజావుగా నిర్వర్తించడానికి ఇవన్నీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు తరచుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ వాహనంతో పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించేందుకు వీలవుతుంది’’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీలో మొదటిసారి ఎన్నికైన వారు, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని, తమ విధులను నిర్వర్తించడానికి వారికి కారు అవసరమని తెలిపారు. తగిన లాజిస్టిక్స్ మద్దతు లేకుండా ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయలేరని, వారికి కార్లు కేటాయించాలని వీసీకే ఎమ్మెల్యే జోతిమణి కోరిన తర్వాత సీఎం నుంచి ఈ ప్రకటన వెలువడింది. కాగా, ప్రస్తుతం తమిళనాడులో ఎమ్మెల్యేల వేతనం సగటున రూ. 1.05 లక్షలు, భత్యం మరో రూ. 80 వేల వరకూ ఉంది.
నిరసనల నిర్ణయంపై యూటర్న్
విద్యార్థులు రాజకీయ పార్టీల నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనరాదంటూ విధించిన నిషేధంపై తమిళనాడు సర్కార్ యూ టర్న్ తీసుకుంది. నిరసనలు తెలపకుండా ఆంక్షలు విధించడం విద్యార్థుల ప్రజాస్వామిక హక్కును కాలరాయడమేనంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం విజయ్ ప్రభుత్వం దిగొచ్చింది. జారీ చేసిన రెండు రోజులకే బుధవారం ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది.