Reading Time: 4 minutes

పథకాలు బలంగా ఉన్నా.. మైలేజీ ఎక్కడ?

Caption of Image.

రేవంత్ సర్కారుకు  ప్రజా సంక్షేమ పథకాలే  బలం.  కానీ కాంగ్రెస్​ ప్రభుత్వానికి రాజకీయ బలహీనత ఎందుకు ఎదురవుతోంది?  సంక్షేమ పథకం లబ్ధి అందితేనే ప్రభుత్వానికి ఓటు వేస్తారన్న లెక్కలు రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ  ప్రభుత్వ పనితీరుకు పథకాలే  పూర్తి కొలమానమా?  పథకాల లబ్ధిదారుల సంఖ్యతోనే  ప్రజల అనుకూలతను, వ్యతిరేకతను అంచనా వేయగలమా?  

ఎన్నికల తీర్పు అనేది పథకాల లబ్ధి, పాలన, అభివృద్ధి,  స్థానిక సమస్యలు, నాయకత్వంపై నమ్మకం.. ఇలా ఎన్నో అంశాల సమ్మేళనం.  పథకాలకే  ఓట్లు పడతాయనుకుంటే  కేసీఆర్ ఓడేవాడు కాదు.  జగన్‌‌‌‌ను చిత్తుగా ఓడించేవారు కాదు.  స్టాలిన్‌ ఓటమిని ఎవరూ అంచనా వేయలేదు.  గెలుపోటములకు పథకాలు  ప్రధానం కాదన్నది ప్రజాక్షేత్రంలో  నిరూపితమవుతున్న నిజం. కాకపోతే  ప్రజల్లో ప్రభుత్వం తీరు ఎలా ఉన్నదో అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా నిలుస్తోంది. 

తెలంగాణలో  ప్రభుత్వం మారిన తరువాత పాలనాశైలి మారిందని కాంగ్రెస్‌‌‌‌ చెబుతోంది.  సంక్షేమ పథకాలు  కొనసాగించడమే కాకుండా,  కొన్ని పథకాలను కొత్తరూపంలో వేగంగా అమలు చేస్తున్నామని  రేవంత్‌‌‌‌ ప్రభుత్వం చెబుతోంది.  కానీ  రాజకీయంగా చూస్తే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది.  పథకాలు ఉన్నాయి.  లబ్ధిదారులూ ఉన్నారు.  డబ్బు ఖర్చవుతోంది.. అయినా ప్రభుత్వానికి రావాల్సినంత రాజకీయ గుర్తింపు ఎందుకు రావడం లేదన్నది  కాంగ్రెస్  వర్గాల్లో  మెదులుతున్న కీలక ప్రశ్న.  

 

 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌,  రేవంత్  రెండు  ప్రభుత్వాల హామీలు, ఆర్థిక పరిస్థితులు, పథకాల స్వభావం వేరు.  కేసీఆర్‌‌‌‌ పాలనలో  రైతుబంధు,  రైతుబీమా, ఆసరా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్‌‌‌‌ వంటి పథకాలు ఒక సుస్థిర సంక్షేమ బ్రాండ్‌‌‌‌గా మారాయి.  రేవంత్‌‌‌‌ ప్రభుత్వం మాత్రం పాత  పథకాల్లో  కొన్నింటిని కొనసాగిస్తూ,  ఎన్నికల ఆరు గ్యారంటీల నుంచి కొత్త పథకాలను అమలుచేస్తోంది.  ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో..  ఒకేసారి రూ.2లక్షలు రుణమాఫీ చేయడం దేశంలోనే  రికార్డు.   రైతుల రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ దేశమంతటా ప్రశంసలు కురిపించినా తెలంగాణలో రాజకీయంగా అంతగా పేరు తేలేకపోయింది.

 వాస్తవానికి  కేసీఆర్  ప్రభుత్వంతో  పోల్చితే, వ్యవసాయాధారిత  తెలంగాణ రాష్టంలో  రైతుల కోసం వివిధ పథాకల కింద రేవంత్ ప్రభుత్వమే  అధికంగా  ఖర్చు పెడుతోంది. మహాలక్ష్మి కింద మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌‌‌‌ సిలిండర్‌‌‌‌, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌‌‌, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌‌‌‌ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా.. ఇవన్నీ సామాన్య కుటుంబ బడ్జెట్‌‌‌‌ పై ప్రభావం చూపే పథకాలు.  అయితే, అక్కడే రాజకీయ కోణం,  ప్రచారం, అమలులో కనిపించే ఫలితం కీలకమవుతుంది.

పథకాల్లో తేడా ఏంటి?

రేవంత్‌‌‌‌ ప్రభుత్వం  2026  జులై నాటికి వ్యవసాయ రంగంలో  రూ.1.70 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలకు పెంచామని, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొంది. కానీ రాజకీయ కోణంలో మాత్రం ప్రభుత్వానికి రావాల్సినంత పేరు రావడం లేదన్నది నిజం.  మహాలక్ష్మి పథకం కేవలం ఉచిత బస్సు ప్రయాణం కాదు.  ఈ పథకాన్ని కేవలం ‘ఉచితం’గా కాకుండా మహిళా ఆర్థిక సాధికారత, ప్రజా రవాణా సామర్థ్యం అనే రెండు కోణాల్లో చూడాలి. రూ.500 గ్యాస్‌‌‌‌ సిలిండర్‌‌‌‌ మరో ప్రత్యక్ష లబ్ధి.

గ్యాస్‌‌‌‌ ధర పెరిగిన కాలంలో వంటింటి ఖర్చును తగ్గించే పథకం ఇది.  గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌‌‌ అనేది పేద, దిగువ ,మధ్యతరగతి కుటుంబానికి నేరుగా కనిపించే ప్రయోజనం.  ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌కు ఒక అవకాశం ఉంది. ‘200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌ ఇచ్చాం’ అని చెప్పడం కంటే, ఏడాదికి ఒక కుటుంబం ఎంత ఆదా చేసుకుంది? ఆ ఆదాతో పిల్లల చదువుకు, ఆరోగ్యానికి, ఇతర అవసరాలకు ఎంత ఉపయోగపడింది? అనే లెక్కను ప్రజల ముందుంచాలి. 

సన్నబియ్యం, రేషన్‌‌‌‌ కార్డుతోపాటు ఇందిరమ్మ ఇళ్లు అసలైన గేమ్‌‌‌‌చేంజర్‌‌‌‌

సన్నబియ్యం పథకం రాజకీయంగా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ పేదవాడి ఇంట్లో ప్రతిరోజూ వండే అన్నం విషయంలో నాణ్యత పెరగడం ఒక పెద్ద సంకేతం. అదేవిధంగా రేషన్‌‌‌‌ కార్డు అనేది కేవలం కార్డు కాదు. అది పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థలో ప్రవేశపత్రం.    పేదవాడి జీవితాన్ని మార్చే పథకాలలో ఇందిరమ్మ ఇల్లు అత్యంత ప్రభావవంతమైనది.  సొంత ఇల్లు జీవితకాల ఆస్తి.  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తొలి దశలో 4.5 లక్షల ఇళ్లను, ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున నిర్మించేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే విధానం రూపొందించారు. ఇది  సమయానికి పూర్తయితే కాంగ్రెస్‌‌‌‌కు  గ్రామీణ  తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ ఆస్తిగా మారే అవకాశం ఉంది. కానీ ఇళ్ల విషయంలో ఎంపిక, నిర్మాణం, బిల్లుల చెల్లింపు, నాణ్యత..ఈ నాలుగు దశల్లో ఎక్కడైనా ఆలస్యం జరిగితే గేమ్‌‌‌‌చేంజర్‌‌‌‌  కాస్తా ‘హామీ’గానే మిగిలిపోతుంది.

రైతు రుణమాఫీ కాంగ్రెస్‌‌‌‌కు పెద్ద అవకాశం

రైతు రుణమాఫీ మాత్రం కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తనకు తానే ఇచ్చుకున్న అతిపెద్ద రాజకీయ పరీక్ష. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అమలు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షం మాత్రం లబ్ధిదారుల సంఖ్య, అర్హతలు, మిగిలిన కేసులు వంటి అంశాలపై నిరంతరం ప్రశ్నలు వేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌ చేయాల్సింది రాజకీయ వాదన కాదు. గ్రామం, మండలం, నియోజకవర్గం వారీగా లబ్ధిదారుల పూర్తి డేటాను ప్రజల ముందుపెట్టడం. ఎవరికి ఎంత మాఫీ అయింది? ఇంకా ఎవరికి ఎందుకు కాలేదు? సమస్య ఎక్కడ ఉంది?
ఈ వివరాలను బహిరంగం చేస్తే ప్రతిపక్ష విమర్శలకు సమాధానం మాత్రమే కాదు, ప్రభుత్వంపై  ప్రజలలో  విశ్వసనీయత కూడా పెరుగుతుంది.

గుర్తింపు ఎందుకు రావడం లేదంటే?

ఇదే అసలు రాజకీయ పజిల్‌‌‌‌.  మొదటి కారణం ప్రభుత్వం తన కథను తానే సరిగ్గా చెప్పుకోలేకపోవడం.  రెండో కారణం కాంగ్రెస్‌‌‌‌లో  సమష్టి  ప్రచారం లోపించడం.  ముఖ్యమంత్రి  ఒక్కరే ప్రతి పథకాన్ని 
వివరించాల్సిన పరిస్థితి ఉండకూడదు.  మంత్రులు, ఎమ్మెల్యేలు,  ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో తమకు సంబంధించిన లబ్ధిదారుల వద్దకు వెళ్లాలి. మూడో కారణం.. ప్రతిపక్షం ప్రభుత్వానికి  వ్యతిరేకంగా   ప్రచారం  వేగవంతం చేసి  ఒక చిన్న సమస్యను కూడా పెద్ద రాజకీయ కథనంగా మారుస్తుంటే,   అధికార పార్టీ మాత్రం పెద్ద విజయాన్ని కూడా ఫైల్‌‌‌‌,  ప్రెస్‌‌‌‌నోట్‌‌‌‌,  సభ ప్రసంగం స్థాయిలోనే వదిలేస్తోంది. నాలుగో కారణం..  అమలు.  పథకం  ప్రకటించగానే రాజకీయ ప్రయోజనం రాదు. లబ్ధిదారుడి చేతికి ప్రయోజనం అందిన రోజే  రాజకీయ జ్ఞాపకం ఏర్పడుతుంది.  మరోవైపు  ప్రతిపక్షం బలంగా ఉండటం మాత్రమే కాదు. అధికార పార్టీ తన బలాన్ని  పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడమే అసలు బలహీనత. 

రేవంత్‌‌‌‌  ప్రభుత్వం ఏం చేయాలి?

ముందుగా రేవంత్ ప్రభుత్వం ‘మేం ఏం చేశాం?’ అనే ప్రశ్నకు కాదు, ‘ప్రజల జీవితంలో ఏం మారింది?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి.  రెండోది.. ప్రతి నియోజకవర్గానికి వెల్ఫేర్‌‌‌‌ డ్యాష్‌‌‌‌బోర్డ్‌‌‌‌  ప్రకటించాలి. ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు?  ఎన్ని రేషన్‌‌‌‌ కార్డులు? ఎంతమంది రైతులకు రుణమాఫీ? ఎంతమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు? ఎన్ని కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్‌‌‌‌ ప్రయోజనం కలిగింది? ఇలా ప్రజలకు అర్థమయ్యే భాషలో లెక్కలు చెప్పాలి. మూడోది.. పథకాలను కేవలం సంక్షేమంగా కాకుండా సంపద సృష్టితో అనుసంధానం చేయాలి.  నాలుగోది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు క్రమం తప్పకుండా  గ్రామసభలకు వెళ్లాలి.  కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తమ పథకాలు ఎవరి జీవితాలను ఉన్నతంగా ఎలా మార్చాయి, ఇంకా ఏమి చేయబోతున్నాం అనేది రాజకీయ కోణంలో  చెప్పాలి.  ప్రతిపక్షం విమర్శిస్తూనే ఉంటుంది. కానీ.  ప్రభుత్వం మాత్రం తన పనితీరును  ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి దీటైన సమాధానం చెప్పాలి.

– వెంకట్ గుంటిపల్లి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

©️ VIL Media Pvt Ltd.