Reading Time: 2 minutes
Tamil Nadu Cm Vijay Announces Big Package Government Cars For Mlas

Tamil Nadu CM Vijay Announces Big Package: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ పర్యటనలకు ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్ల జీతాలు, వాహన నిర్వహణకు నెలవారీ భత్యం, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సహాయకులను నియమించుకునేందుకు ప్రత్యేక నిధులు, ప్రజలకు ఆరోగ్య బీమా పరిమితి పెంపు వంటి పలు నిర్ణయాలను ప్రకటించారు. ఎమ్మెల్యేలు తరచుగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, స్థానిక సమస్యలను పర్యవేక్షించేందుకు ప్రతి ఎమ్మెల్యేకూ నియోజకవర్గ పర్యటనల కోసం ప్రభుత్వ వాహనం అందించనున్నట్లు ప్రకటించారు. వాహనాలకు డ్రైవర్ల జీతాలు, వాహన సంబంధిత ఖర్చుల కోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75,000 భత్యంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యాలయ పనుల కోసం ఒక సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 అందించనున్నట్లు వెల్లడించారు.

ఆరోగ్య బీమా రూ.25 లక్షలకు పెంపు

తమిళనాడు ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో లబ్ధిదారులకు ఖరీదైన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సల సమయంలో మరింత ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. అదనంగా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని వైద్య, శస్త్రచికిత్స సేవలను అందించనున్నట్లు ప్రకటించారు. చెన్నై, తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వైద్య విద్యకు రూ.351 కోట్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విద్యా సంస్థల్లో అడ్మిషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం రూ.351 కోట్లు కేటాయించింది. దీని ద్వారా వివిధ ఆరోగ్య సంబంధిత కోర్సుల్లో మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660 సీట్లు, నర్సింగ్ కాలేజీలు, పాఠశాలల్లో 1,925 అదనపు సీట్లు, 12 పారామెడికల్, కోర్సుల్లో 2,778 సీట్లు, మెడికల్ కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉండనున్నాయి. అలాగే రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పెరంబలూరులో 400 పడకల ఆసుపత్రి

పెరంబలూరు జిల్లాలో 400 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పెరంబలూరు ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందడంతో పాటు రాష్ట్రంలోని ఆరోగ్య మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి.

పాల సేకరణ ధర పెంపు

పాల ఉత్పత్తిదారులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను ప్రస్తుతం ఉన్న లీటరుకు రూ.38 నుంచి రూ.41కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 3.16 లక్షలకు పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అదే సమయంలో పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని కూడా లీటరుకు రూ.3 నుంచి రూ.5కు పెంచనున్నారు. పాల సేకరణ ధర పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి ఈ వ్యయం సుమారు రూ.360 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రజలు, ఎమ్మెల్యేలకు ప్రయోజనం కల్పించేలా పలు నిర్ణయాలు

ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మరింత సమర్థంగా పనిచేసేందుకు వాహనాలు, సిబ్బంది సహాయం అందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య బీమా కవరేజీని భారీగా పెంచడం, వైద్య విద్యలో సీట్ల సంఖ్యను పెంచడం, కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, పాల ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వడం వంటి పలు నిర్ణయాలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలతో రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం, వైద్య విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎమ్మెల్యేల నియోజకవర్గ స్థాయి పనితీరుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.