
- సర్కారు సూత్రప్రాయ నిర్ణయం
- 22 ఏలో జిల్లాలవారీగా పెట్టిన ఇంటి నంబర్ల వివరాలు సేకరిస్తున్న కలెక్టర్లు
- ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలు, వివిధ జీవోల కింద రెగ్యులరైజ్ చేసిన ఇండ్ల స్థలాలపై ఫోకస్
- లే అవుట్లు, అర్బన్ సీలింగ్
- ల్యాండ్‌లపై పూర్తిస్థాయి నివేదికలు
- వేలం వేసి అమ్మిన ల్యాండ్ పార్శిళ్లు సైతం పరిగణనలోకి..
- భూ భారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లలో స్పెషల్ ఆప్షన్
- నాన్ అగ్రికల్చర్‌లో 44 కోట్ల పైన స్క్వేర్ యార్డులు అప్‌డేట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్లాట్లు, నివాస గృహాల కొనుగోలుదారులు, యజమానులను ఎన్నో రోజులుగా తీవ్ర అవస్థలకు గురిచేస్తున్న నిషేధిత భూముల జాబితా (22ఏ) సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భూ లావాదేవీల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ చట్టపరమైన చిక్కులను విడదీసేందుకు నిషేధిత జాబితా నుంచి నివాస గృహాల ఇంటి నంబర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నిషేధిత జాబితాలో నిలిచిపోయిన నాన్- అగ్రికల్చర్ ప్రైవేటు ఆస్తులు, సక్రమంగా మార్పు చెందిన నివాస ప్రాంతాలను దాని నుంచి వేరుచేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా 22ఏ జాబితాలో చేరిన నివాస గృహాలు, ఫ్లాట్లు, విల్లాల సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన వివిధ జీవోల ప్రకారం రెగ్యులరైజ్ చేసిన ఇండ్ల స్థలాలు, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలు, అనుమతి పొందిన లే అవుట్లు, అర్బన్ సీలింగ్, సర్ ప్లస్ భూముల్లో ఏర్పాటైన నివాసాల వివరాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరిలాంటి కీలక జిల్లాల్లో గతంలో అధికారులు అధికారికంగా వేలం వేసి విక్రయించిన ప్లాట్ల వివరాలను కూడా ఈ జాబితా నుంచి తొలగించనున్నారు.
భూ భారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్లలో ఈ సమాచారాన్ని సరిచూసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. దాదాపు 44 కోట్ల చదరపు గజాల నాన్ -అగ్రికల్చర్ భూమికి సంబంధించిన రికార్డులను వేగంగా అప్‌డేట్ చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం, సామాన్యులకు రిజిస్ట్రేషన్ల చిక్కులు తప్పించేలా ముందుకు వెళ్తున్నది.
సమస్య ఉన్న ఫ్లాట్‌నే 22ఏలోకి..
ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధిత జాబితా నమోదు విధానం వల్ల తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. సాధారణంగా బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లకు ఒకే సర్వే నంబర్ ఆధారంగా ఒకే ప్రధాన ఇంటి నంబర్ ఉంటుంది. ఆ భవనంలో ఉన్న పదుల సంఖ్యలోని ఫ్లాట్లలో ఏదో ఒక్క ఫ్లాట్‌కు సంబంధించి కోర్టు వివాదాలు ఉన్నా లేదా బ్యాంకు వేలం ప్రక్రియలు నడుస్తున్నా.. సాంకేతిక లోపాల వల్ల మొత్తం అపార్ట్‌మెంట్ సర్వే నంబర్‌ను లేదా ప్రధాన ఇంటి నంబర్‌ను 22ఏ జాబితాలో చేర్చడం పరిపాటైంది.
దీంతో ఎలాంటి తప్పు చేయని, వివాదాలు లేని మిగిలిన ఫ్లాట్ల యజమానులు సైతం తమ ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఇకపై అపార్ట్‌మెంట్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టకుండా, సమస్య ఉన్న సదరు ఫ్లాట్ నంబర్‌ను మాత్రమే ప్రత్యేకంగా గుర్తించి 22ఏలో చేర్చనున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు, సర్వే నంబర్లలో నిర్మించిన విల్లాల విషయంలోనూ ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నారు. ఏ విల్లా అయితే చట్టపరమైన సమస్యల్లో ఉందో, దానికి సంబంధించిన సర్వే నంబర్ ఆ నిర్దిష్ట విల్లా నంబర్‌ను మాత్రమే ఆంక్షల పరిధిలోకి తెస్తారు. మిగతా ఉమ్మడి విస్తీర్ణం, వివాదరహిత విల్లాల నంబర్లను సాధారణ రిజిస్ట్రేషన్లకు అందుబాటులో ఉంచనున్నారు.
అర్బన్ సీలింగ్, ప్రభుత్వ నో- ఆబ్జెక్షన్ భూములకు ఉపశమనం
పట్టణాల పరిధిలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) మిగులు భూములు, ఇతర రకాల ప్రభుత్వ స్థలాల్లో ఏండ్ల క్రితం నివాసాలు ఏర్పరచుకున్న వేలాది కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపశమనం కలిగిస్తోంది. ఆయా జిల్లాల్లో గతంలో అమలైన క్రమబద్ధీకరణ పథకాల (జీవోల) కింద అర్హులైన వారికి ఎంత విస్తీర్ణంలో పట్టాలు ఇచ్చారు?ఎవరెవరి పేర్లతో రెగ్యులరైజేషన్ జరిగింది? అనే అంశాలపై రికార్డుల ఆధారంగా జిల్లాలవారీగా సమగ్ర జాబితాలు రూపొందిస్తున్నారు. నివాస గృహాలుగా మారిన యూఎల్సీ స్థలాలకు సంబంధించిన పోర్టల్ డేటాలో ఏవైనా ఇంటి నంబర్లు 22ఏ కింద నమోదై ఉంటే, వాటిని వెంటనే తొలగించనున్నారు.
అలాగే, దేశ రక్షణలో భాగస్వాములైన త్రివిధ దళాల సిబ్బందికి, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం గతంలో కేటాయించిన భూముల విషయంలోనూ ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. ఇలాంటి కేటాయింపులకు సంబంధించి సంబంధిత అధికారులు గతంలో జారీ చేసిన ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) ఆధారంగా భూములను నిషేధిత జాబితా నుంచి మినహాయిస్తున్నారు.
రక్షణ దళాల కుటుంబాలకు ఇచ్చిన భూముల్లో చాలాచోట్ల నిబంధనల ప్రకారం వ్యవసాయేతర భూమి (నాలా)గా మార్పిడి చేసి, అనుమతి పొందిన లేఅవుట్లుగా మార్చి ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇవి రికార్డుల్లో ఇప్పటికీ నిషేధిత భూములుగానే చూపిస్తుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిక్కుముడులన్నింటినీ విడదీసి అధికారిక నివేదికల ఆధారంగా తొలగింపు చర్యలు చేపడుతున్నారు.
ఆ ఇండ్ల రికార్డుల పునఃపరిశీలన
యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లాంటి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు సంబంధించిన వివాదాలు 22ఏ జాబితా వల్ల మరింత సంక్లిష్టంగా మారాయి. 40 నుంచి 50 ఏండ్ల క్రితమే అసైన్డ్ భూములుగా వర్గీకరించబడిన స్థలాల్లో వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లను నిర్మించుకొని నివాసముంటున్నాయి. నాటి నుంచి స్థానిక సంస్థల నమోదు పుస్తకాల్లో ఇవి నివాస గృహాలుగా నమోదుకావడమే కాకుండా దశాబ్దాలుగా ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్లు కూడా నాలుగైదు సార్లు మారాయి.
అయితే, నిషేధిత జాబితాను ఆన్‌లైన్ చేసిన సమయంలో సర్వే నంబర్ల ఆధారంగా చేయడంతో ఆటోమేటిక్‌గా ఈ ఇండ్లన్నీ 22ఏ పరిధిలోకి వెళ్లడంతో క్రమవిక్రయాలు నిలిచిపోయాయి. ఈ విధమైన సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పరిశీలన బృందాలను రంగంలోకి దించుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తై, స్థానిక పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో పన్నులు చెల్లిస్తున్న ఇండ్లను అసైన్డ్ భూముల నిషేధిత రికార్డుల నుంచి వేరు చేయనున్నారు. గ్రామాల్లోని ఈ ఇండ్ల నంబర్లకు సంబంధించిన పత్రాలను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా వెరిఫై చేసి, వివాదరహిత నివాసాలుగా గుర్తించిన వాటి నంబర్లను నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తారు.
పోర్టల్‌లో అప్‌డేట్ ఆప్షన్
భూ భారతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్లలో సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు వీలుగా కలెక్టర్లకు ఆప్షన్లను అందుబాటులోకి తేనున్నారు. దీంతో అందులో ఉంచిన నివేదికల ఆధారంగా తమ ఆస్తి లేదా ఫ్లాట్ నంబర్ 22ఏ పరిధిలో ఉందో లేదో యజమానులు ఆన్‌లైన్‌లోనే క్షణాల్లో సరిచూసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఒకవైపు నిజమైన ప్రభుత్వ, అటవీ, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కచ్చితంగా నిషేధిత జాబితాలోనే ఉంచుతూనే.. మరోవైపు పొరపాటున లేదా ఉమ్మడి సర్వే నంబర్ల కారణంగా 22ఏలో చేరిన సామాన్యుల నివాస గృహాలు, ఫ్లాట్లకు విముక్తి కల్పిస్తారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న ఆస్తులను 22ఏలో సరిచూస్తున్నారు. జాబితాలో ఉన్నప్పటికీ ఎలాంటి వివాదం లేని ఆస్తి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆస్తుల క్రయ విక్రయాలు జరగకపోయినా.. రాబోయే కొద్ది రోజుల్లో జిల్లాల కలెక్టర్ల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందగానే, వెబ్‌సైట్‌లో ఈ సవరించిన డేటాను అధికారికంగా అందుబాటులోకి తేనున్నారు.
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
ప్రజల ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకొని లబ్ధి పొందేందుకు కొందరు అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత ‘22 ఏ’ జాబితా సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని, ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేని నివాస గృహాలు, ఫ్లాట్లను కూడా సక్రమమైనవిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందింది. నిజానికి 22ఏ పరిధిలోనే ఉండాల్సిన విలువైన ప్రభుత్వ భూములు, అటవీ స్థలాలు, దేవాదాయ ఆస్తులను నిషేధిత జాబితాలో లేవంటూ తప్పుడు పత్రాలతో ప్రైవేటు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగాన్ని సర్కారు పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి ఆక్రమణలు, అక్రమాలకు తావివ్వవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం వల్లగానీ, కుమ్మక్కై అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినా..సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు, రికార్డులను పర్యవేక్షించే అధికారులపై శాఖాపరమైన విచారణతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.