
హైదరాబాద్: రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన 22-ఏ నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 22-ఏ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మీ అంగుళం భూమి కూడా ఎక్కడికి పోదని భరోసా కల్పించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
మంగళవారం (ఆగస్ట్ 18) 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.
రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ఆదేశించాను. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించానని తెలిపారు.ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
►ALSO READ | సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమన్నారు. 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని.. ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దని సూచించారు.