Reading Time: < 1 minute
Nokia 125 4g 2nd Edition Coming With The Features Like 2 4 Inch Display 1450mah Battery And More

Nokia 125 4G 2nd Edition: హెచ్‌ఎండీ (HMD) గ్లోబల్ మరో కొత్త నోకియా (Nokia) ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తుంది. కొత్తగా నోకియా 125 4G 2nd ఎడిషన్ ఆన్‌లైన్‌లో కనిపించింది. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ గతంలో వచ్చిన నోకియా 210 4Gకు దగ్గరగా ఉండే స్పెసిఫికేషన్లతో రానుంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులోకి రాబోతుంది. ఇందులో డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఫోన్ ముందు భాగంలో 2.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ 320 × 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.

కెమెరాల విషయానికి వస్తే.. ముందు, వెనుక భాగాల్లో 0.3MP కెమెరాలను అందించనున్నట్లు లీక్ వెల్లడించింది. వెనుక కెమెరాకు ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ఇవి అధునాతన ఫోటోగ్రఫీ కోసం కాకుండా సాధారణ ఫొటోలు, ప్రాథమిక వీడియో కాలింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడే కెమెరాలుగా చెప్పుకోవచ్చు. హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌లో హెచ్‌ఎండీ ఫీచర్ ఫోన్లలో ఉపయోగించే తేలికపాటి S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. 1,450mah బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఫీచర్ ఫోన్‌కు తగిన తక్కువ పవర్ వినియోగం కారణంగా ఈ బ్యాటరీతో రోజువారీ వినియోగంలో ఎక్కువ కాలం బ్యాకప్ లభించే అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ ఫోన్ ధర, అధికారిక లాంచ్ తేదీ, పూర్తి కనెక్టివిటీ వివరాలను హెచ్‌ఎండీ ఇంకా వెల్లడించలేదు. అయితే పేరు సూచిస్తున్నట్లుగానే 4జీ కనెక్టివిటీకి ఈ ఫోన్ ప్రాధాన్యతగా ఉండనుంది.

స్మార్ట్‌ఫోన్లకు బదులుగా కేవలం కాల్స్, మెసేజింగ్, ప్రాథమిక మల్టీమీడియా అవసరాల కోసం సరళమైన ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను తీసుకురానున్నారు. కాంపాక్ట్ డిజైన్, 4జీ సపోర్ట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, సులభమైన ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అంశాలు దీని ప్రధాన ఫీచర్స్. హెచ్‌ఎండీ అధికారికంగా మరిన్ని వివరాలను ప్రకటించిన తర్వాత నోకియా 125 4G 2nd Edition ధర, లభ్యత, పూర్తి ఫీచర్లపై స్పష్టత రానుంది.