Reading Time: < 1 minute
Prabhas Om Raut New Movie Rumours Clarity Prabhas Pr Team

పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, గతంలో ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఈరోజు ఉదయం నుంచి ప్రచారం మొదలైంది. బాలీవుడ్‌లో మొదలైన ఈ ప్రచారం చివరికి అన్ని భాషల్లోనూ రకరకాల హెడ్డింగ్‌లతో వార్తలు వండి వార్చే వరకు చేరింది.

ఓం రౌత్ ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో కథ చెప్పాడని, అది ప్రభాస్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని రమ్మని చెప్పారంటూ ఈ ప్రచారం సాగుతోంది. అయితే ఇదే విషయం మీద ఎన్టీవీ, ప్రభాస్ పీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయమేమీ నిజం కాదని వారు పేర్కొన్నారు.

వాస్తవానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికన్నా ఎక్కువగా దర్శకుడు ఓం రౌత్ టార్గెట్ అయ్యాడు. గ్రాఫిక్స్ మొదలుకొని ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సహా సినిమాలో కనిపించిన చాలామంది నటీనటుల లుక్స్ విషయంలో కూడా టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో అసలు ప్రభాస్ మరోసారి అతనికి అవకాశం ఇస్తాడా? అంటూ కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎవరో కావాలని పుట్టించిన ఒక రూమర్ తప్ప ఇందులో నిజం లేదని తేలిపోయింది.