Reading Time: 2 minutes

డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. టెన్నిస్ నుంచి నిక్ కిర్గియోస్‌ సస్పెండ్

Caption of Image.

Nick Kyrgios: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్ 13 నిక్ కిర్గియోస్ నిషేధిత డ్రగ్స్ వాడుతూ దొరికిపోవడంతో క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ITIA) అతనిపై సడన్‌గా ప్రొవిజనల్ బ్యాన్ విధించింది. జూన్ 22న జరిగిన మల్లోర్కా ఓపెన్ టోర్నీ సందర్భంగా నిక్ కిర్గియోస్‌కు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను కొకైన్ వాడినట్లు నిర్ధారణ కావడంతో ఆగస్టు 4వ తేదీన అతనిపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ అమలులో ఉన్నంత వరకు అతను గ్రాండ్‌స్లామ్‌లు సహా ఎలాంటి ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఆడటానికి, కోచింగ్ ఇవ్వడానికి లేదా చివరికి మ్యాచ్‌లకు హాజరవడానికి కూడా పర్మిషన్ ఉండదు.

పెద్ద తప్పు చేశా క్షమించండి: కిర్గియోస్ ఎమోషనల్ నోట్: 

ఈ షాకింగ్ న్యూస్ బయటకు రాగానే నిక్ కిర్గియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నాడు. నేను ఒక విపరీతమైన పెద్ద తప్పు చేశాను, దానికి పూర్తి బాధ్యత నాదే.. నా అభిమానులు, కుటుంబం, స్పాన్సర్లు, ముఖ్యంగా నన్ను రోల్ మోడల్‌గా భావించే పిల్లలకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నావల్ల ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అయినందుకు నా మీద నాకే చాలా నిరాశగా ఉందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

డిప్రెషన్ పై మనసు విప్పిన టెన్నిస్ స్టార్: 

తన పరిస్థితికి గల కారణాలను వివరిస్తూ.. గడిచిన రెండేళ్లుగా మోకాలు, మణికట్టు గాయాలతో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. మైండ్ అనుకున్నట్లు శరీరం సహకరించకపోవడంతో, కెరీర్ ముగింపునకు వచ్చేసిందనే ఘోరమైన సత్యాన్ని తట్టుకోలేక చాలా ఒంటరిగా, నిస్సహాయంగా ఫీల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తప్పును సరిదిద్దుకోవడానికి రాబోయే 28 రోజుల పాటు సోషల్ మీడియాకు, పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు.

డేంజర్‌లో పడిన ప్రొఫెషనల్ కెరీర్: 

గాయాల సమస్యల వల్ల ఈ సీజన్‌లో కేవలం నాలుగు సింగిల్స్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 31 ఏళ్ల నిక్ కిర్గియోస్, చివరిగా వింబుల్డన్ డబుల్స్‌లో ఆడి ఫస్ట్ రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ఇప్పుడు ఈ కొకైన్ రచ్చతో అతని ప్రొఫెషనల్ కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తప్పును రియలైజ్ అయి బ్రేక్ తీసుకుంటున్న కిర్గియోస్, మళ్లీ లైఫ్‌ను ట్రాక్‌లోకి తెచ్చుకుని ఎంతవరకు స్ట్రాంగ్‌గా కంబ్యాక్ ఇస్తాడో లేదో అనేది వేచి చూడాల్సింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.