
- పరిశ్రమల నిర్ణయంపై మంత్రి పొంగులేటి ప్రశంసలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు మార్కెట్ ధర కంటే తక్కువకే సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీలు అంగీకరించాయి. గత కొద్ది నెలలుగా హౌసింగ్, ఇండస్ట్రీస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు పలుమార్లు సిమెంట్కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మంగళవారం సెక్రటేరియెట్ లో కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొంగులేటి, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ సమావేశమయ్యారు.
ఈ మీటింగ్ లో ప్రభుత్వం అడిగిన ధరకు సిమెంట్ సరఫరా చేస్తామని కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. ప్రస్తుతం మార్కెట్ లో సిమెంట్ బస్తా రూ.330 ఉండగా.. ఇందిరమ్మ ఇండ్లకు రూ.230 కి ఇస్తామని వారు ప్రకటించారు. కాగా, ప్రభుత్వ స్కీమ్ కోసం సమాజిక బాధ్యతగా ముందుకు వచ్చి.. తక్కువ ధరకు సిమెంట్సరఫరా చేస్తామని ప్రకటించినందుకు కంపెనీల ప్రతినిధులను మంత్రి పొంగులేటి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని.. పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. వీటిలో ఇప్పటికే 85 శాతం ఇండ్ల శ్లాబులు పూర్తయ్యాయని.. మిగిలిన 15 శాతం ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే, క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ కు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడినా పేదల ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా.. ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు