Reading Time: < 1 minute
Mohanlal Seven Upcoming Movies Seven Star Directors

Mohanlal: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఏకంగా ఏడు సినిమాల్లో ఆయన నటించనున్నట్లు వెల్లడిస్తూ.. వాటిని తెరకెక్కించనున్న డైరెక్టర్ల పేర్లను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఎగ్జైటింగ్‌ స్టోరీస్‌, ఎగ్జైటింగ్‌ జర్నీస్‌, కొందరు ఎంతో ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్‌” అంటూ మోహన్‌లాల్‌ తన ఏడు ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచారు. ఆయన లైనప్‌లో విష్ణు మోహన్‌, అనూప్‌ సత్యన్‌, ప్రియదర్శన్‌, దిలీష్‌ పోతన్‌, సత్యన్‌ అంతిక్కాడ్‌, జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌, జీతూ జోసెఫ్‌ వంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు.

ఈ లీస్ట్‌లో విష్ణు మోహన్‌, అనూప్‌ సత్యన్‌ వంటి యంగ్ డైరెక్టర్స్‌తో పాటు ప్రియదర్శన్‌, సత్యన్‌ అంతిక్కాడ్‌ వంటి సీనియర్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు విభిన్న కథలు, సహజమైన కథనాలతో గుర్తింపు తెచ్చుకున్న దిలీష్‌ పోతన్‌తో మోహన్‌లాల్‌ కాంబినేషన్‌ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ‘2018’తో భారీ సక్సెస్ అందుకున్న జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌, ‘దృశ్యం’ సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీతూ జోసెఫ్‌తోనూ మోహన్‌లాల్‌ సినిమాలు చేయనున్నారు. దీంతో ఈ ఏడు ప్రాజెక్టులు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన కథలు, షూటింగ్‌ షెడ్యూల్స్‌, నటీనటులు, రిలీజ్ డేట్స్‌పై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మోహన్‌లాల్‌ ఒకేసారి ఏడుగురు ప్రముఖ దర్శకులతో ప్రాజెక్టులు ప్రకటించడం మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.