Reading Time: 2 minutes
Dead Bodies Found Under Soil Mound 4 Bodies 9 Skulls Recovered

Vizag Crime: మట్టి కుప్పలో మృతదేహాలు, మనిషి పుర్రెలు బయటపడుతున్న ఘటన విశాఖపట్నంలో తీవ్ర సంచలనంగా మారింది. మట్టిని తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు, పుర్రెలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు, తొమ్మిది మనిషి పుర్రెలు బయటపడినట్లు సమాచారం. ఘటన స్థలంలో ప్రొక్లెయిన్‌ సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టారు. తవ్వే కొద్దీ మృతదేహాలు, పుర్రెలు బయటపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన వెనుక అసలు కారణమేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అర్థరాత్రి తర్వాత మృతదేహాలను తరలించినట్లు అనుమానం
మృతదేహాలను అర్థరాత్రి రెండు గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి మట్టిలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడైనా ఉన్న స్మశానం నుంచి మృతదేహాలను తవ్వి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతదేహాలు లభించిన ప్రాంతంలో వెదురు చాపలు, తెల్లటి వస్త్రాలు, పూల దండలు, దిండులు, దుప్పట్లు కూడా కనిపించాయి. దీంతో మృతదేహాలను ఏదైనా స్మశానం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

రోడ్డు పనులను ఆసరాగా చేసుకుని డంప్ చేశారా?
షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ – సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం తెచ్చిన మట్టి ఈ మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన గుర్తుతెలియని వ్యక్తులు.. పనుల కోసం మట్టి తరలింపు జరుగుతున్న సమయంలోనే మృతదేహాలను కూడా మట్టిలో డంప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసుల దృష్టి
మృతదేహాలను ఎవరు తీసుకొచ్చారు? ఏ వాహనంలో తరలించారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించిన వాహనాలు, వ్యక్తుల వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి కుప్పలో వరుసగా మృతదేహాలు, పుర్రెలు బయటపడటంతో ఈ ఘటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మృతదేహాల గుర్తింపు, అవి ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు ఫోరెన్సిక్‌, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.