
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పీఏసీఎస్లో రూ.28 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇటీవల నిర్వహించిన ఆడిట్ లో ఈ వ్యవహారం వెలుగు చూడగా, నిధులు దుర్వినియోగం చేసిన సేల్స్మెన్ల నుంచి రికవరీ చేయాలని మంగళవారం జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులకు పీఏసీఎస్ చైర్మన్ పోల మల్కారెడ్డి, సెక్రటరీ రాజారాం వినతిపత్రం అందజేశారు. ఎడపల్లి పీఏసీఎస్ పరిధిలో ఎడపల్లి, తానాకలాన్, కుర్నాపల్లి గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలున్నాయి. వీటిలో ముగ్గురు సేల్స్మెన్లుఎరువులు అమ్ముతారు. ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులను వీరు రెండేళ్లుగా పీఏసీఎస్ ఖాతాలో జమ చేయలేదు. ఎడపల్లి సేల్స్‌మెన్ రూ.25 లక్షలు, తానాకలాన్ సేల్స్‌మెన్ రూ.3 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆడిట్లో తేలింది.