Reading Time: < 1 minute
‘గౌడ్లు తలుచుకుంటే మరో ఐదుసార్లు మనదే అధికారం’.. పాపన్న విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్!

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సమసమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం కొనియాడారు. చరిత్రలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ వాటిని సమాజానికి పూర్తిస్థాయిలో చెప్పుకోలేకపోయామని అన్నారు.

పాపన్న గౌడ్‌ గురించి బ్రిటిష్ మ్యూజియంలోనూ పుస్తకాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు సందర్శించేలా పాపన్న విగ్రహానికి నెక్లెస్‌ రోడ్‌లో సముచిత స్థానం కల్పించామని తెలిపారు. విగ్రహాలను ఆవిష్కరించడం మాత్రమే కాకుండా వాటి నిర్వహణ కూడా ముఖ్యమని అన్నారు. అమరవీరుల స్థూపానికి ఎంత ప్రాధాన్యత ఉందో పాపన్న విగ్రహానికీ అంతే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

బహుజన నాయకుడు పండుగ సాయన్నకు కూడా తగిన గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గౌడ, నేత, గీత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని, తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు.

గౌడలు తలచుకుంటే మరో ఐదుసార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావచ్చని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌ అనంతరం తెలంగాణలో 117 అసెంబ్లీ స్థానాలు ఏర్పడితే కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉద్యమకారులకు కీలక పదవులు కల్పించిందని పేర్కొన్నారు.

కులవృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నతంగా చదివించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్య ద్వారానే తలరాతలు మారుతాయని అన్నారు. పిల్లల విద్య కోసం ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, తాము తినే నాణ్యమైన బియ్యాన్నే పాఠశాలల్లోనూ పెడుతున్నామని తెలిపారు.

రాజకీయ అంశాలపైనా ముఖ్యమంత్రి స్పందించారు. గత పాలకులు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చిన తీరుతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిందని వివరించారు. పాపన్న గౌడ్‌ స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..