
Jailer 2 OTT Deal: రజనీకాంత్ సినిమా అంటే థియేటర్లలో హంగామా మొదలయ్యే ముందే బిజినెస్ లో లెక్కలు కూడా మొదలవుతాయి. సూపర్‌స్టార్‌కు ఉన్న మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటిచెప్పేలా ‘జైలర్ 2’ గురించి ఓ భారీ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లలో అడుగుపెట్టడానికి ఇంకా సమయం ఉండగానే ఈ సినిమా ఏకంగా రూ.160 కోట్ల విలువైన ఓటీటీ డీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే 2026లోనే అత్యంత భారీ నాన్ థియేట్రికల్ డీల్స్‌లో ఇదొకటిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు, టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్‌కు మరోసారి మాస్ ఇమేజ్‌ను తనదైన స్టైల్ లో చూపించారు. ఇప్పుడు అదే పాత్రను మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ సీక్వెల్ రూపొందుతోంది. అనిరుధ్ రవిచందర్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘జైలర్ 2’కు రూ.160 కోట్ల విలువైన ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందం ఏ స్ట్రీమింగ్ సంస్థతో జరిగిందనే విషయం మాత్రం వెల్లడికాలేదు. అలాగే ఇది పూర్తిస్థాయి డిజిటల్ రైట్స్ డీలా, లేక ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు కూడా ఇందులో భాగమా అనే విషయంలోనూ స్పష్టత లేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూ.160 కోట్ల మొత్తాన్ని ఆఫీషియల్ గా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ వార్త నిజమైతే మాత్రం ‘జైలర్ 2’ కమర్షియల్ గా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్‌కు ఉన్న మార్కెట్‌తో పాటు, ‘జైలర్’ ఫ్రాంచైజీకి ఏర్పడిన క్రేజ్ ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
‘జైలర్ 2’ అక్టోబర్ 15, 2026న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్‌ను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అంతకుముందు విడుదలైన 55 సెకన్ల ప్రోమో సీక్వెల్‌పై ఆసక్తిని మరింత పెంచింది. మొదటి సినిమాలో వినాయకన్ చెప్పిన చివరి డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ప్రోమో, ముత్తువేల్ పాండియన్ ఎదుర్కొన్న సమస్యలు చిన్న నెట్‌వర్క్‌కు సంబంధించినవి కావని, మరింత పెద్ద వ్యవస్థతో ముడిపడి ఉన్నాయనే సంకేతాలను ఇచ్చింది.
సీక్వెల్‌లో కూడా భారీ తారాగణం కనిపించనుంది. రమ్యకృష్ణ, మీర్నా, యోగిబాబు వంటి మొదటి భాగం నటులతో పాటు సూరజ్ వెంజరమూడు, సంతానం, మేఘనా రాజ్ సర్జా, జతిన్ సర్నా, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి వంటి దక్షిణాది స్టార్లతో పాటు హృతిక్ రోషన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
‘జైలర్ 2’ తర్వాత కూడా రజనీకాంత్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నారు. ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించనున్న ‘ధర్మన్’లో ఆయన నటించనున్నారు. అంతేకాకుండా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి మరో ప్రాజెక్ట్‌లో కనిపించే అవకాశాలపై కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే రూ.160 కోట్ల ఓటీటీ డీల్ అంటూ వస్తున్న ‘జైలర్ 2’ వార్తలు నిజమైతే, అది రజనీకాంత్ స్టార్ పవర్‌కు మరో ఉదాహరణగా నిలవడం ఖాయం.