Reading Time: < 1 minute
ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన రెస్టారెంట్ కూర.. ఏం జరిగిందంటే?

సూరత్‌, ఆగస్ట్ 19: సూరత్‌ నగరంలోని రాణుజాధామ్‌ సొసైటీలో నివసించే అశోక్‌భాయ్‌ కల్సారియా కుటుంబం స్థానికంగా ఉన్న షీతల్‌ రెస్టారెంట్‌ నుంచి కాజూ-పనీర్‌ కర్రీని ఆర్డర్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆగస్టు 16న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అశోక్‌భాయ్‌, ఆయన కుమార్తెల్లో ఒకరికి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. ఉదయం 9 గంటలకు స్థానిక క్లినిక్‌లో చికిత్స తీసుకున్నప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడలేదు. కొద్దిసేపటికే కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బాధితులందరినీ సూరత్‌లోని సద్విచార్‌ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగానికి చేరుకున్న 15 నుంచి 20 నిమిషాల్లోనే ఐదేళ్ల ఆర్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతురాలి తండ్రి అశోక్‌భాయ్‌, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో వారికి ఫుడ్‌ పాయిజనింగ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు రెస్టారెంట్‌ నుంచి తీసుకొచ్చిన కాజూ-పనీర్‌ కర్రీ తిన్న తర్వాతే అనారోగ్యానికి గురయ్యామని ఆరోపించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై గుజరాత్‌ ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్‌ పాన్షేరియా అత్యవసరంగా స్పందించారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్‌ అనిల్‌ పటేల్‌, సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమ్రిగర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా సూరత్‌లోని షీతల్‌ రెస్టారెంట్‌ను వెంటనే సీజ్‌ చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఘటనపై అధికారులు ఆహార నమూనాలను పరిశీలించి, ఫుడ్‌ పాయిజనింగ్‌కు అసలు కారణాలను నిర్ధారించే అవకాశం ఉంది. ఐదేళ్ల చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.