Reading Time: 2 minutes
దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

కాశిఫ్‌ అలియాస్‌ ‘కాశీ’ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారును అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల కారణంగా కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె 15 ఏళ్ల సోదరి అసీమా తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. అందులో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారును అడ్డగించి సమీపం నుంచి కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తుంది. ఘటన అనంతరం షమ్సో బీబీ తండ్రి ఆస్పత్రికి వెళ్లి కుమార్తె మృతదేహాన్ని గుర్తించారు. నిందితులు ఇంకా పరారీలో ఉన్నప్పటికీ.. వారికి ఆశ్రయం, సమాచారం అందించినట్లు అనుమానిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యపై రావల్పిండి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షమ్సో బీబీ హత్యకు సోషల్‌ మీడియా కార్యకలాపాలు కారణం కాదని, ఆర్థిక వివాదమే కారణమై ఉండొచ్చని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కౌసర్‌, జావేద్‌ అలియాస్‌ షాహీన్‌తో షమ్సోకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తండ్రి పోలీసులకు తెలిపారు. డబ్బు తిరిగి చెల్లించాలంటూ వారిద్దరి నుంచి షమ్సోకు బెదిరింపులు వచ్చినట్లు కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో కౌసర్‌, జావేద్‌ హత్యకు పథకం వేసి ఉండొచ్చని, కాశిఫ్‌ అలియాస్‌ కాశీ వారిని ప్రేరేపించి ఉండొచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. అయితే హత్యకు అసలు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. షమ్సో బీబీకి టిక్‌టాక్‌లో 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారని ఆమె సోదరుడు రెహ్మతుల్లా తెలిపారు. ఆమె ఖాతాలో 35 మిలియన్లకు పైగా లైక్స్‌ ఉన్నాయని చెప్పారు. ఆమె మరణం తర్వాత కుటుంబసభ్యులు టిక్‌టాక్‌ ఖాతాను డీయాక్టివేట్‌ చేశారు. షమ్సోకు కౌసర్‌, జావేద్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు, డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబం పేర్కొంది. ఈ విషయంపై ఇస్లామాబాద్‌లో ఆమె ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపింది.

పాక్‌లో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పెరుగుతున్న దాడులు

షమ్సో బీబీ హత్యతో పాకిస్థాన్‌లో సోషల్‌ మీడియాలో గుర్తింపు ఉన్న మహిళలపై జరుగుతున్న దాడులపై మరోసారి ఆందోళన రేకెత్తించింది. టిక్‌టాక్‌ పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌ మీడియా వేదికల్లో ఒకటిగా ఉంది. మహిళలకు ఇది ఆదాయం సంపాదించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే మహిళలు వేధింపులు, హింసను ఎదుర్కొంటున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. 2026 మార్చిలో టిక్‌టాక్‌ క్రియేటర్‌ సనా జావేద్‌ ఇస్లామాబాద్‌లో కాల్చి చంపబడ్డారు. ఆమె భర్తే ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. 2025 జూన్‌లో 17 ఏళ్ల టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సనా యూసఫ్‌ ఇస్లామాబాద్‌లోని తన ఇంట్లో కాల్చి చంపబడ్డారు. తన ప్రేమ ప్రతిపాదనలను పలుమార్లు తిరస్కరించడంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. 2026 మేలో ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడికి పాకిస్థాన్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

2025 జూలైలో రావల్పిండిలో 16 ఏళ్ల టిక్‌టాక్‌ క్రియేటర్‌ మెహక్‌ షెహ్‌జాదీ కాల్చి చంపబడ్డారు. ఆమె టిక్‌టాక్‌ వినియోగాన్ని తండ్రి వ్యతిరేకించేవారని, కుటుంబ గౌరవానికి సంబంధించిన అంశంపై ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేశారు. అదే ఏడాది జూలైలో సింధ్‌ ప్రావిన్స్‌లో టిక్‌టాక్‌ క్రియేటర్‌ సుమీరా రాజ్‌పుత్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆమెను బలవంతపు వివాహానికి ఒత్తిడి చేసిన వ్యక్తులు విషప్రయోగం చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇక 2025 ఆగస్టులో లాహోర్‌లోని గ్రేటర్‌ ఇక్బాల్‌ పార్క్‌లో వీడియో తీస్తున్న కంటెంట్‌ క్రియేటర్‌ ఆయేషా అక్ఱమ్‌పై ఓ గుంపు దాడి చేసింది. పాకిస్థాన్‌లో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పెరుగుతున్న హింసకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. అయితే షమ్సో బీబీ కుటుంబం మాత్రం ఆమె సోషల్‌ మీడియా కార్యకలాపాల కారణంగా కాకుండా ఆర్థిక వివాదం నేపథ్యంలోనే హత్య జరిగిందని చెబుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు సంగతేమనేది నిందితుల అరెస్ట్ తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.