
కేవలం 200 మిల్లీసెకన్లలో ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తుపట్టడం, 7 మిల్లీసెకన్లలో కంటి చూపును సర్దుబాటు చేసుకోవడం, 50 ఏళ్ల క్రితం నాటి సంఘటనలను సైతం గుర్తుంచుకోవడం.. ఇదంతా చేసే అద్భుత అవయవమే మానవ మెదడు. దాదాపు ఒక కిలోబరువు, సుమారు 14,000 మిలియన్ల కణాలతో కూడిన ఈ మృదు కణజాల గోళం మానవ శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన వ్యవస్థ. మెదడు మొత్తం కణజాలంలో 85 శాతం భాగం సెరిబ్రమ్‌గా రెండు అర్ధగోళాలుగా విభజించబడి ఉంటుంది. ఆలోచనలు, మానసిక భావోద్వేగాలు, జ్ఞాపకశక్తిని నియంత్రించే ప్రధాన కేంద్రం ఇదే. కంటి రెటీనా నుండి సంకేతాలను స్వీకరించి మనకు దృష్టి అనుభూతిని కలిగిస్తుంది. మెదడు కాండం, సెరిబ్రమ్‌లను కలిపే నాడీ వంతెనగా పాన్స్ వరోలి వ్యవహరిస్తుంది. వెన్నుపాముకు అనుసంధానమై ఉండే సెరెబెల్లమ్ భాగం శరీర కండరాల కదలికలను సమన్వయం చేస్తూ, శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. కుడి సెరెబెల్లమ్ శరీర ఎడమ వైపు అవయవాల సమాచార మార్పిడికి తోడ్పడుతుంది. మెదడు అడుగున ఉండే ఈ హైపోథాలమస్ అనే చిన్న భాగం శరీర ఉష్ణోగ్రత, నీటి పరిమాణం, జీవక్రియలతో పాటు ఆకలి, దాహం, కోపం, సంతోషం వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
మెదడు పరిశోధనలలో కీలక మైలురాయి
1985లో ఎంఆర్ఐ స్కానర్ అందుబాటులోకి వచ్చేంత వరకు మరణించిన వారి మెదడు భాగాలను పరిశీలించడం ద్వారా లేదా ఊహాగానాల ఆధారంగానే పరిశోధనలు జరిగేవి. అయితే ఆధునిక సాంకేతికత, జన్యు అధ్యయనాల పుణ్యమా అని ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తి మెదడు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూసే స్థాయికి విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది.
పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం
బయటి వాతావరణం, పంచేంద్రియాల ద్వారా పొందే అనుభవాలకు అనుగుణంగా మెదడు తనను తాను నిరంతరం తీర్చిదిద్దుకుంటుంది. మనం చూసే కాంతి, వినే శబ్దాలు, వాసనలు, ఆలోచనల ఆధారంగా మెదడులోని న్యూరాన్లు కొత్త అనుసంధానాలను ఏర్పరచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి.
రాత్రిపూటే ఎక్కువ చురుకు.. భవిష్యత్తును ఊహించే శక్తి
మనం నిద్రపోయే సమయంలో మెదడు విశ్రాంతి తీసుకుంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి నిద్రలోనే మెదడు అత్యంత వేగంగా, చురుగ్గా పనిచేస్తుంది.
డోపమైన్ – భవిష్యత్ సంకేతాలు: మనం కనే కలలు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. మెదడులోని డోపమైన్ వ్యవస్థ ఇంకా జరగని సంఘటనలకు సంబంధించిన ముందస్తు సంకేతాలను అందించగలదని, దీని ద్వారా మెదడు భవిష్యత్తును అంచనా వేయగలదని పరిశోధకులు చెబుతున్నారు.
పరిమాణంతో నైపుణ్యం: మెదడు పరిమాణం అందరిలో ఒకేలా ఉండదు. పెద్ద మెదడు కలిగిన వ్యక్తులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, విశ్లేషణాత్మక ఆలోచనలు మెరుగ్గా ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జ్ఞాపకశక్తి రహస్యాలు – మనం వాడేది ఎంత?
జ్ఞాపకాల రసాయన రికార్డులు: మనం నేర్చుకునే ప్రతి విషయం మెదడులో రసాయన రికార్డులుగా నిక్షిప్తమవుతుంది. మానవులలో దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అపారంగా ఉంటుంది.
4 శాతం వినియోగం: మానవ మెదడులోని 96 శాతం కణాలు జ్ఞాపకశక్తి పనుల్లో నేరుగా పాల్గొనవు. మానవులు తమ జ్ఞాపకశక్తి సామర్థ్యంలో కేవలం 4 శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రపంచ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గే వేళలు: మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య మరియు తెల్లవారుజామున 2 నుండి 4 గంటల మధ్య మెదడు జ్ఞాపకశక్తి కాస్త మందగిస్తుంది. ఈ సమయాల్లో క్లిష్టమైన లెక్కలు, నిర్ణయాలు తీసుకుంటే పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
కౌమార దశ: కౌమార వయస్సులో మెదడు నిర్మాణం ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. పూర్తిగా పరిపక్వత చెందదు. అందుకే ఈ దశను రెండవ క్లిష్ట వయస్సుగా పరిగణిస్తారు.