Reading Time: 3 minutes
Personalized Mrna Cancer Vaccine Shows Promise In Melanoma Phase 3 Trial

Melanoma Cancer Vaccine: క్యాన్సర్ చికిత్సలో మరో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. మోడెర్నా, మెర్క్ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యక్తిగతీకరించిన mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ఇంటిస్‌మెరాన్ ఆటోజీన్ (intismeran autogene)పై చివరి దశ క్లినికల్ ట్రయల్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ప్రకటించాయి. మెర్క్‌కు చెందిన విస్తృతంగా ఉపయోగించే ఇమ్యూనోథెరపీ కీట్రూడా (Keytruda/pembrolizumab)తో కలిపి ఈ వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఉపయోగించినప్పుడు, మెలనోమా తిరిగి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రధాన లక్ష్యాన్ని సాధించినట్లు కంపెనీలు వెల్లడించాయి. అలాగే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదానికి సంబంధించిన కీలక ద్వితీయ లక్ష్యాన్ని కూడా ఈ కాంబినేషన్ సాధించింది.

1,137 మంది మెలనోమా రోగులతో ట్రయల్

Phase 3 INTerpath-001 ట్రయల్‌లో పూర్తిగా శస్త్రచికిత్స ద్వారా తొలగించిన Stage IIB నుంచి IV వరకు ఉన్న మెలనోమా రోగులు మొత్తం 1,137 మంది పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కు వ్యక్తిగతీకరించిన mRNA థెరపీ అయిన intismeran autogeneతో పాటు Keytruda ఇచ్చారు. మరో గ్రూప్‌కు Keytruda మాత్రమే అందించారు.

కాంబినేషన్ చికిత్స తీసుకున్నవారిలో recurrence-free survival (క్యాన్సర్ తిరిగి వచ్చే వరకు వ్యాధి లేకుండా ఉండే కాలం)లో గణాంకపరంగా ముఖ్యమైన, వైద్యపరంగా మీనింగ్ ఫుల్ ఇంప్రూవ్ మెంట్ కనిపించినట్లు కంపెనీలు తెలిపాయి. అలాగే distant metastasis-free survivalలో కూడా మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. అంటే క్యాన్సర్ శరీరంలోని దూర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండే విషయంలో చికిత్స ప్రయోజనం చూపించింది.

పర్సనలైజ్డ్ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఏమిటి?

సాధారణ వ్యాక్సిన్లు ప్రధానంగా ఇన్ఫెక్షన్లను నివారించేందుకు రూపొందిస్తారు. కానీ వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్లు ఒక్కో రోగి క్యాన్సర్‌కు ఉన్న ప్రత్యేక జన్యు లక్షణాలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తారు. క్యాన్సర్ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత, దానిలోని జన్యు మార్పులను విశ్లేషిస్తారు. ఈ మార్పుల్లో రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు ఉపయోగపడే లక్ష్యాలను గుర్తిస్తారు. Intismeran autogeneను రోగి కణితిలో కనిపించే ప్రత్యేక జన్యు మార్పుల ఆధారంగా రూపొందిస్తారు. దీని ఉద్దేశం రోగనిరోధక వ్యవస్థకు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై దాడి చేయడం నేర్పించడం.

Keytrudaతో కలిపి మంచి ఫలితాలు

మెలనోమా చికిత్సలో Keytruda ఇప్పటికే ప్రముఖ ఇమ్యూనోథెరపీగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దానికి రోగి కణితి ప్రత్యేక జన్యు లక్షణాల ఆధారంగా రూపొందించిన mRNA చికిత్సను జోడించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు రావచ్చనే ఆశలు కలిగాయి. ట్రయల్‌లో సుమారు ఒక సంవత్సరం పాటు చికిత్స అందించారు. కాంబినేషన్ థెరపీ ప్రధాన లక్ష్యమైన recurrence-free survivalతో పాటు distant metastasis-free survival అనే కీలక ద్వితీయ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. కంపెనీల ప్రకారం, ఇప్పటివరకు తెలిసిన భద్రతా సమాచారంతో పోలిస్తే కొత్తగా ఆందోళన కలిగించే భద్రతా సంకేతాలు కనిపించలేదు.

mRNA క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి

మోడెర్నా, మెర్క్ ఈ ఫలితాలను వ్యక్తిగతీకరించిన neoantigen therapy, అలాగే mRNA ఆధారిత క్యాన్సర్ చికిత్సలో తొలి సానుకూల Phase 3 ఫలితాలుగా అభివర్ణించాయి. అయితే పూర్తి స్థాయి ట్రయల్ డేటా ఇంకా విడుదల కాలేదు. మొత్తం జీవనకాలం (overall survival)పై కూడా అధ్యయనం కొనసాగుతోంది. అందువల్ల ఈ చికిత్స వల్ల రోగులు ఎక్కువ కాలం జీవిస్తారని ఇప్పుడే నిర్ధారించడం తొందరపాటు అవుతుంది.

గత పరిశోధనల్లోనూ సానుకూల సంకేతాలు

తాజా ఫలితాలు ఇంతకుముందు జరిగిన పరిశోధనలకు కొనసాగింపుగా వచ్చాయి. KEYNOTE-942 అధ్యయనానికి సంబంధించిన ఐదేళ్ల డేటాలో కూడా Keytrudaతో వ్యక్తిగతీకరించిన mRNA థెరపీని కలిపినప్పుడు recurrence-free survival మెరుగుపడినట్లు వెల్లడైంది. క్యాన్సర్ దూర ప్రాంతాలకు వ్యాపించడం లేదా దాని కారణంగా మరణించే ప్రమాదం తగ్గినట్లు కూడా గత పరిశోధనల్లో గుర్తించారు. Overall survivalకు సంబంధించిన ప్రాథమిక విశ్లేషణలోనూ ఆశాజనకమైన సంకేతాలు కనిపించాయి. అయితే ఈ చికిత్స ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉంది.

ఇతర క్యాన్సర్లపైనా పరిశోధనలు

మెలనోమాతో పాటు ఇతర క్యాన్సర్లలోనూ intismeran autogene ప్రభావాన్ని మోడెర్నా, మెర్క్ పరిశీలిస్తున్నాయి. వారి INTerpath కార్యక్రమంలో మెలనోమా, నాన్-స్మాల్ సెల్, లంగ్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

మెలనోమా రోగులకు దీని అర్థం ఏమిటి?

మెలనోమా చర్మ క్యాన్సర్‌లో అత్యంత తీవ్రమైన రకాలలో ఒకటి. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు చికిత్స మరింత క్లిష్టంగా మారుతుంది. అధిక ప్రమాదం ఉన్న మెలనోమా రోగులకు శస్త్రచికిత్స తర్వాత క్యాన్సర్ మళ్లీ రాకుండా చూడటం చాలా ముఖ్యమైన చికిత్స లక్ష్యం. ఈ నేపథ్యంలో వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్ రోగి రోగనిరోధక వ్యవస్థకు ప్రత్యేకమైన క్యాన్సర్ కణాలను గుర్తించడంలో అదనపు సహాయం అందించే అవకాశం ఉంది. అయితే ఇంటిస్‌మెరాన్ ఆటోజీన్ ఇంకా పరిశోధనలో ఉన్న చికిత్సే. తాజా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పూర్తి క్లినికల్ డేటా, దీర్ఘకాలిక ఫాలోఅప్, నియంత్రణ సంస్థల సమీక్ష తర్వాతే దీని అసలు ప్రయోజనాలు, ప్రమాదాలపై స్పష్టత వస్తుంది.

వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి?

ఈ ఫలితాలు మెలనోమాకు మాత్రమే కాకుండా క్యాన్సర్ చికిత్స భవిష్యత్తుకు కూడా ప్రాధాన్యత కలిగి ఉండవచ్చు. వ్యక్తిగతీకరించిన mRNA చికిత్సలు భద్రత, సమర్థత విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధిస్తే, రోగి కణితి జన్యు లక్షణాల ఆధారంగా చికిత్సను రూపొందించే Precision Oncology విధానానికి ఇది మరింత బలాన్ని ఇవ్వవచ్చు. మోడెర్నాకు కూడా ఇది కీలక పరిణామమే.

ఇన్ఫెక్షన్లకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో ఉపయోగించిన mRNA టెక్నాలజీని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది. మొత్తంగా, మెలనోమాలో వ్యక్తిగతీకరించిన mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌పై వచ్చిన తాజా Phase 3 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే దీన్ని సాధారణ క్యాన్సర్ చికిత్సగా పరిగణించడానికి ఇంకా పూర్తి డేటా, దీర్ఘకాలిక ఫలితాలు, నియంత్రణ అనుమతులు అవసరం.