Reading Time: 2 minutes

గాయత్రి గోపీచంద్‌కు అర్జున ..మొత్తం 17 మందికి పురస్కారాలు 

Caption of Image.
  •   మొత్తం 17 మందికి పురస్కారాలు    ఈసారి నో ఖేల్‌రత్న

న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ పుల్లెల గాయత్రి గోపీచంద్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 ఏడాదికిగానూ మొత్తం 17 మంది క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఆరు నెలల కిందట ఎంపిక చేసిన 24 మంది జాబితాను మరోసారి పరిశీలించి 17 మందికి కుదించారు. 2024లో 32 మందికి అర్జున ప్రకటించగా, ఇందులో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ఈసారి కేవలం ఇద్దరు పారా అథ్లెట్లకు మాత్రమే అర్జున దక్కింది. 2024 పారా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ గెలిచిన పారా క్లబ్‌ త్రోయర్‌ ఏక్తా భ్యాన్‌తో పాటు షూటర్‌ రుద్రాన్ష్‌ ఖండేలవాల్‌ ఇందులో ఉన్నారు. ఈ సారి క్రికెటర్లెవరికీ అర్జున దక్కలేదు. 1962 ఆసియా గేమ్స్‌ గోల్డ్‌ మెడల్‌ విన్నింగ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మెంబర్‌ ఐ అరుమనాయగంకు అర్జున లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. ధర్మేంద్ర యాదవ్‌, వీరేందర్‌ కుమార్‌కు ద్రోణాచార్య లైఫ్‌టైమ్‌ అవార్డులు లభించాయి. పర్వీర్‌ సింగ్‌, చోటేలాల్‌ యాదవ్‌, నేహా చవాన్‌.. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీని ఇవ్వనున్నారు.  

ఖేల్‌రత్న లేదు..

క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డులను ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. అరుణ్‌ కుమార్‌ మిశ్రా కమిటీ ఈ పురస్కారం కోసం హాకీ స్టార్‌ హార్దిక్‌ సింగ్‌ పేరును పరిశీలించినా.. ఆయన చివరి వరకు రేసులో నిలవలేకపోయాడు. దాంతో ఖేల్‌రత్న లేకుండానే అర్జున అవార్డులను ప్రకటించారు. గతంలో 2014లోనూ ఖేల్‌రత్న ఎవరికీ ఇవ్వలేదు. గతేడాది డి. గుకేశ్‌ (చెస్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), ప్రవీణ్‌ కుమార్‌ (పారా అథ్లెట్‌), మను భాకర్‌ (షూటర్‌)కు ఖేల్‌రత్న ఇచ్చారు.  

అర్జున అవార్డులు: తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్), ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్), నరేందర్ (బాక్సింగ్), విదిత్ గుజరాతీ (చెస్), దివ్య దేశ్‌ముఖ్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (చెవిటి, షూటింగ్), రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్ (కబడ్డీ), రుద్రాన్ష్‌ ఖండేలవాల్‌ (పారా- అథ్లెటిక్స్), అరవింద్ సింగ్ (రోయింగ్), అఖిల్ షెరోన్‌ (షూటింగ్), ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్), గాయత్రి గోపీచంద్ (బ్యాడ్మింటన్), లాల్‌రెమిసియామి (హాకీ), మహమ్మద్ అజ్మల్ (అథ్లెటిక్స్), పూజ (కబడ్డీ), ఏక్తా భ్యాన్‌ (పారా అథ్లెటిక్స్‌).

తండ్రికి తగ్గ తనయ..

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి అర్జున అవార్డుకు గాయత్రికి మాత్రమే లభించడం విశేషం. లెజెండ్‌ షట్లర్‌ పుల్లెల గోపీచంద్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న గాయత్రి ఆటలోనూ మేటి అని నిరూపించుకుంది. ట్రీసా జోలీతో కలిసి 2022 ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ విమెన్స్‌ డబుల్స్‌లో సెమీస్‌కు చేరింది. అప్పట్నించి వరుస విజయాలతో తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందింది. గోపీచంద్‌ అకాడమీలో సైనా, సింధు ఆటను చూసి స్ఫూర్తి పొందిన గాయత్రి బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.

తర్వాత వరుసగా టైటిల్స్‌ గెలిచి 15 ఏళ్ల వయసులో అండర్‌–17 విభాగంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. దేశవాళీ ర్యాంకింగ్‌ టోర్నీల్లో ఆడి ఆటను మెరుగుపర్చుకున్న గాయత్రి 2018 జకార్తా ఆసియా క్రీడలకు ఎంపికైంది. 2019లో సీనియర్‌ స్థాయిలో ఆడి నేపాల్‌లో జరిగిన సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో విమెన్స్‌ సింగిల్స్‌లో సిల్వర్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2021లో డబుల్స్‌ ప్లేయర్‌గా మారడం ఆమె కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. తమ కోచింగ్‌ సెంటర్‌లోనే ఉన్న ట్రీసా జోలీతో కలిసి తొలిసారి డబుల్స్‌లో బరిలోకి దిగింది. ఈ ఇద్దరు 2021లో ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌లో గోల్డ్‌, వేల్ష్‌ టోర్నీలో సిల్వర్‌తో దుమ్మురేపారు. 2022లో సయ్యద్‌ మోడీ టోర్నీలో ఫైనల్‌కు చేరడంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఒడిశా ఓపెన్‌లో తమ తొలి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను నెగ్గారు. 

©️ VIL Media Pvt Ltd.