
కోల్‌కతాలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్‌లో ఉన్న ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెల్లవారుజామున దాదాపు 2:00 గంటల ప్రాంతంలో చెలరేగిన ఈ మంటలు వేగంగా వ్యాపించడంతో, హోటల్‌లో ఉన్న పలువురు లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన కొందరు బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. మరో బాధితుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు 60 మందిని రక్షించగా, అపస్మారక స్థితిలో లభించిన తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రాథమిక విచారణలో ఆ హోటల్‌లో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు కూడా లేవని తేలింది. హోటల్ మూడో అంతస్తులో మొదలైన ఈ మంటలు ఏసీపేలడం వల్లే సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోల్‌కతా పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న హోటల్ యజమాని, సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు